Murali Nayak: వీరజవాన్ మురళీనాయక్‌కు నేడు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు.. అంతిమయాత్రలో పాల్గొననున్న రాష్ట్ర మంత్రులు

- మురళీనాయక్ పార్ధివదేహాన్ని ఆయన తల్లిదండ్రులకు అప్పగించిన సైనికాధికారులు
- వీరజవాన్ మురళీనాయక్ అంత్యక్రియలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత తదితరులు
- గ్రామంలో విస్తృత పోలీసు బందోబస్తు
పాకిస్థాన్‌తో జరిగిన పోరులో అసువులు బాసిన వీర జవాన్ మురళీనాయక్ భౌతికకాయాన్ని ఆయన స్వగ్రామానికి తరలించారు. మురళీనాయక్ పార్థివ దేహాన్ని ఢిల్లీ నుంచి ఇండిగో విమానంలో మొదట బెంగళూరు విమానాశ్రయానికి తీసుకువచ్చారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా శనివారం రాత్రి శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని కళ్లితండాకు తరలించారు.
సైనికాధికారులు మురళీనాయక్ పార్థివదేహాన్ని ఆయన తల్లిదండ్రులు శ్రీరామనాయక్, జ్యోతిబాయిలకు అప్పగించారు. వీర జవాన్ అంత్యక్రియలు ఈరోజు గ్రామంలో అధికార, సైనిక లాంఛనాలతో జరుగుతాయి. ఈ అంత్యక్రియలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్ తదితరులు హాజరై నివాళులర్పించనున్నారు. మురళీనాయక్ అంత్యక్రియలకు ప్రముఖులు కళ్లితండాకు విచ్చేయనుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
నిన్న మధ్యాహ్నం 2 గంటలకు బెంగళూరు విమానాశ్రయం వద్ద మురళీనాయక్ పార్థివదేహంతో ప్రారంభమైన ర్యాలీ రాత్రి 9.30 గంటల వరకు కొనసాగింది. మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమరవీరుడికి శ్రద్ధాంజలి ఘటించారు.