Virat Kohli: విరాట్ నిర్ణయం మార్చుకుంటాడా? రంగంలోకి కీలక వ్యక్తి!

- టెస్టుల నుంచి కోహ్లీ కూడా తప్పుకుంటాడని వార్తలు
- ప్రముఖ వ్యక్తిని రంగంలోకి దించిన బీసీసీఐ
- రోహిత్, కోహ్లీ ఇద్దరూ లేకుండా భారత జట్టుకు కష్టమే
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలగాలని యోచిస్తున్నట్లు వస్తున్న వార్తలు చర్చనీయాంశమయ్యాయి. దీంతో బీసీసీఐ రంగంలోకి దిగింది. కోహ్లీ తన నిర్ణయం మార్చుకునేలా చేసేందుకు ప్రయత్నిస్తోంది. కీలకమైన ఇంగ్లండ్ పర్యటన సమీపిస్తున్న తరుణంలో కోహ్లీ వంటి అనుభవజ్ఞుడైన ఆటగాడి సేవలు జట్టుకు అత్యంత అవసరమని భావిస్తోంది. జూన్ 20 నుంచి ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల ఇంగ్లండ్ సిరీస్‌కు ముందే కోహ్లీ తన నిర్ణయాన్ని బీసీసీఐకి తెలియజేసినట్లు సమాచారం. అయితే, ఇంగ్లండ్ పర్యటనతో పాటు రాబోయే ముఖ్యమైన సిరీస్‌లను దృష్టిలో ఉంచుకుని తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోహ్లీని బీసీసీఐ కోరినట్టు తెలుస్తోంది.
టెస్టుల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలన్న కోహ్లీ ఆలోచనను మార్చేందుకు బీసీసీఐ ఓ ప్రముఖుడిని రంగంలోకి దించినట్టు తెలిసింది. ఆ వ్యక్తి కోహ్లీతో మాట్లాడి కోహ్లీని ఒప్పించనున్నాడని సమాచారం. ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) కొత్త సైకిల్ ప్రారంభం కావడానికి ముందు ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కీలకం కానుంది.
కాగా, రోహిత్ శర్మ విషయంలోనూ ఇలాగే ఆ ప్రముఖ వ్యక్తి మాట్లాడారని, కానీ ఆ పరిస్థితి పూర్తిగా భిన్నమైనదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కోహ్లీ సాధారణంగా తన నిర్ణయాలను మార్చుకోడని, ఆ ప్రభావవంతమైన వ్యక్తి మాటలు కోహ్లీ నిర్ణయంపై, టెస్టు క్రికెట్ భవితవ్యంపై కొంత ప్రభావం చూపవచ్చని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
2011లో టెస్టుల్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి కోహ్లీ 123 టెస్టులు ఆడి 46.85 సగటుతో 9,230 పరుగులు సాధించాడు. ఒకవేళ కోహ్లీ టెస్టుల నుంచి రిటైర్మెంట్ ఆలోచనను వెనక్కి తీసుకోకపోతే, ఇంగ్లండ్ పర్యటనలో రోహిత్ శర్మతో పాటు కోహ్లీ కూడా లేకపోవడంతో భారత జట్టును అనుభవలేమి సమస్య వేధించే అవకాశం ఉంది. గత ఏడాది బార్బడోస్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌ను భారత్ గెలుచుకున్న తర్వాత కోహ్లీ, రోహిత్ ఇద్దరూ టీ20ల నుంచి రిటైర్ అయిన విషయం తెలిసిందే. ఒకవేళ కోహ్లీ టెస్టుల నుంచి కూడా వైదొలిగితే, ఈ ఇద్దరు వెటరన్ ఆటగాళ్లు కేవలం వన్డే క్రికెట్‌లో మాత్రమే భారత్‌కు అందుబాటులో ఉంటారు.