Najam Sethi: ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాం... భారత్ ముందు నిలవలేం: పాక్ క్రెకెట్ బోర్డు మాజీ ఛైర్మన్ ఆవేదన

Pakistan in Danger Former PCB Chairmans Alarming Statement
  • పాక్, ఆర్థికంగా, అంతర్జాతీయంగా బలహీనపడిందన్న నజామ్ సేథీ
  • అమెరికా సహకరించడం లేదని వ్యాఖ్య
  • ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్ లతో సంబంధాలు క్షీణించాయన్న సేథీ
  • అరబ్ ప్రపంచం మొత్తం భారత్ కు మద్దతుగా ఉందని వ్యాఖ్య
  • భారత్ కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందన్న పీసీబీ మాజీ ఛైర్మన్
భారత్ తో పోలిస్తే పాకిస్థాన్ ఆర్థికంగా, అంతర్జాతీయంగా అత్యంత బలహీన స్థితిలో ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ ముందు నిలబడలేని దుస్థితి నెలకొందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాజీ ఛైర్మన్ నజామ్ సేథి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడి, ఆపరేషన్ సిందూర్, ఆ తర్వాత మే 9వ తేదీ రాత్రి పాకిస్థాన్ వైపు నుంచి పలు భారత నగరాలపై దాడికి జరిగిన యత్నం, దానిని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టడం వంటి ఘటనలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో, పాకిస్థాన్‌కు చెందిన ఓ టెలివిజన్ ఛానల్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో పాల్గొన్న నజామ్ సేథి, పాకిస్థాన్ ప్రస్తుత దుస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

"మన దేశం చాలా బలహీనంగా తయారైంది. మనం ప్రస్తుతం ప్రమాదకరమైన దశలో ఉన్నాం. మన అంతర్గత పరిస్థితులు కూడా దారుణంగా ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. అమెరికా కూడా మనకు అండగా నిలబడేందుకు నిరాకరిస్తోంది. ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్‌లతో మన సంబంధాలు దెబ్బతిన్నాయి" అని నజామ్ సేథి విశ్లేషించారు.

కార్యక్రమంలో యాంకర్ జోక్యం చేసుకుంటూ, భారత్ లో కూడా అంతర్గత సమస్యలు ఉన్నాయని, బంగ్లాదేశ్‌తో ఆ దేశ సంబంధాలు కూడా దెబ్బతిన్నాయని ప్రస్తావించారు. అయితే, నజామ్ సేథి ఈ వాదనను పూర్తిగా తోసిపుచ్చారు. "భారత్‌తో పోలిస్తే బంగ్లాదేశ్ చాలా చిన్న దేశం. అంతర్జాతీయంగా భారతదేశానికి ఇప్పటికీ మంచి గుర్తింపు ఉంది. కానీ దురదృష్టవశాత్తు మనకు ఆ పరిస్థితి లేదు. ప్రస్తుత తరుణంలో విదేశీ పెట్టుబడులన్నీ భారత్ కే వెళుతున్నాయి. అరబ్ ప్రపంచం మొత్తం భారత్‌కే మద్దతుగా నిలుస్తోంది. సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలు భారత్‌తో బిలియన్ డాలర్ల కొద్దీ పెట్టుబడి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. భారతదేశం ఏమాత్రం ఒంటరి కాదు, కానీ పాకిస్థాన్ మాత్రం ఒంటరైపోయింది" అని సేథి అన్నారు.
Najam Sethi
Pakistan Cricket Board
Pakistan Economy
India-Pakistan Relations
Geopolitical tensions
South Asia
International Relations
Foreign Investment
US-Pakistan relations

More Telugu News