పాక్‌లోని నంకానా సాహిబ్ గురుద్వారాపై డ్రోన్ దాడి పూర్తిగా అబద్ధం: పీఐబీ ఫ్యాక్ట్ చెక్

  • నంకానా సాహిబ్ గురుద్వారాపై భారత్‌ డ్రోన్ దాడి చేసిందనే వార్తలను ఖండించిన‌ కేంద్రం
  • ఇది పూర్తిగా అబద్ధమ‌ని తేల్చిన‌ పీఐబీ ఫ్యాక్ట్ చెక్
  • భారత్‌లో మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి ఇలాంటివి ప్రచారం చేస్తున్నారని వెల్ల‌డి
పాకిస్థాన్‌లోని నంకానా సాహిబ్ గురుద్వారాపై భారత్‌ డ్రోన్ దాడి చేసిందనే వార్తలను కేంద్ర‌ ప్రభుత్వం శనివారం తోసిపుచ్చింది. "సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ ఒక వీడియోలో భారతదేశం నంకానా సాహిబ్ గురుద్వారాపై డ్రోన్ దాడి చేసిందని పేర్కొంటున్నారు. ఇది పూర్తిగా అబద్ధం" అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తెలిపింది.

భారత్‌లో మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి ఇటువంటి కంటెంట్‌ను ప్రచారం చేస్తున్నారని పీఐబీ పేర్కొంది. కాగా, నంకానా సాహిబ్ గురుద్వారా అనేది సిక్కు మత స్థాపకుడు గురు నానక్ జన్మస్థలం. ఇది సిక్కులకు అత్యంత ప‌విత్ర‌మైన తీర్థయాత్ర కేంద్రం.

అటు పాకిస్థాన్ సైబర్ దాడి కారణంగా భారతదేశ విద్యుత్ గ్రిడ్ పనిచేయడం లేదని, ముంబ‌యి-ఢిల్లీ విమానయాన మార్గాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నారనే వాదనలను కూడా కేంద్ర‌ ప్రభుత్వం తోసిపుచ్చింది. ఇది కూడా ఫేక్ న్యూస్ అని స్ప‌ష్టం చేసింది. 

కార్యాచరణ కారణాల వల్ల ఢిల్లీ, ముంబ‌యి విమాన సమాచార ప్రాంతాల పరిధిలోని 25 విభాగాల ఎయిర్ ట్రాఫిక్ సర్వీస్ (ATS) మార్గాలను తాత్కాలికంగా మూసివేయడాన్ని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పొడిగించిందని కేంద్రం తెలిపింది.


More Telugu News