Turkey: భారత్ చేసిన సాయాన్ని మరిచి పాక్ తో అంటకాగుతున్న తుర్కియే

Turkeys Betrayal From Operation Dost to Aiding Pakistan Against India
  • పాక్ కు డ్రోన్లు, యుద్ధ విమానాలు పంపిన ఎర్డోగాన్
  • గురువారం రాత్రి పాక్ 400 డ్రోన్లతో సరిహద్దుల్లో దాడి
  • ఆ డ్రోన్లు అన్నీ తుర్కియే అందించినవేనన్న భారత సైన్యం
  • పాక్ కు సాయంగా యుద్ధ విమానాలను పంపిన తుర్కియే ప్రెసిడెంట్
రెండేళ్ల క్రితం తుర్కియే (టర్కీ) లో పెను భూకంపం సంభవించగా భారత ప్రభుత్వం వెంటనే స్పందించింది. అత్యవసర మందులు, నిత్యావసరాలతో మిగతా దేశాల కన్నా ముందు పంపించింది. ‘ఆపరేషన్ దోస్త్’ పేరుతో అండగా నిలిచింది. ఇదంతా 2023లోనే జరిగింది. రెండేళ్లలోనే ఈ సాయాన్ని మరిచిన తుర్కియే.. ఇప్పుడు భారత్ కు వ్యతిరేకంగా పనిచేస్తోంది. పాకిస్థాన్ కు అండగా నిలబడి డ్రోన్లు, యుద్ధ విమానాలను పంపించి భారత్ పై దాడికి ప్రోత్సహిస్తోంది. గురువారం సరిహద్దుల్లో పాక్ సైన్యం దాదాపు 400 డ్రోన్లతో విరుచుకుపడిన విషయం తెలిసిందే.

అయితే, వాటన్నింటినీ మన సైన్యం కూల్చివేసింది. ఆ డ్రోన్ల శకలాలను పరిశీలించిన అధికారులు.. అవన్నీ తుర్కియేలో తయారైనవేనని తేల్చారు. దీంతో పాటు శుక్రవారం అర్ధరాత్రి ప్రాంతంలో తుర్కియే కార్గో విమానాలు పాక్ విమానాశ్రయంలో ల్యాండయ్యాయి. వాటిలో యుద్ధ సామాగ్రి ఉందని భారత్ ఆరోపిస్తుండగా.. ఇంధనం నింపుకోవడానికే ఆగాయని తుర్కియే, కర్టెసీ విజిట్ అని పాక్ మభ్యపెడుతున్నాయి. తుర్కియే యుద్ధ నౌక కూడా పాక్ తీరానికి చేరుకున్నట్లు సమాచారం.

జమ్మూకశ్మీర్‌లో పౌరులపై జరిగిన ఉగ్రదాడిని ప్రపంచ దేశాలన్నీ ఖండించినా తుర్కియే మాత్రం నోరు మెదపలేదు. భారత పర్యాటకుల మృతి పట్ల సంతాపం కూడా వ్యక్తం చేయలేదు. పైపెచ్చు పాకిస్థాన్‌కు పూర్తి మద్దతు ప్రకటించింది. భారత్ 'ఆపరేషన్ సిందూర్' కింద పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే), పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసిన తర్వాత కూడా, తుర్కియే పాకిస్థాన్‌కే బాసటగా నిలిచింది. తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో మాట్లాడి సంఘీభావం ప్రకటించారు. కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ వాదనకు తుర్కియే ఎప్పటినుంచో నైతికంగా, ఆర్థికంగా, సైనికపరంగా మద్దతు తెలుపుతోంది. ఇటీవలి కాలంలో తుర్కియే, పాకిస్థాన్‌కు బేరఖ్తార్ టీబీ2, అకింజి వంటి నిఘా డ్రోన్లు, మిల్గెమ్-క్లాస్ కార్వెట్‌ల వంటి నౌకాదళ ఆస్తులను కూడా అందిస్తోందని భారత సైనిక వర్గాలు తెలిపాయి.

Turkey
Pakistan
India
Erdogan
Shehbaz Sharif
Drone attacks
Military aid
Operation Dost
Geopolitics
South Asia

More Telugu News