పాకిస్థాన్ సైబర్ అటాక్... వాట్సాప్ కు ఈ మెసేజ్ లు వస్తే ఓపెన్ చేయకండి!
- పాకిస్థాన్ సైబర్ నేరగాళ్ల నుంచి భారత్కు ముప్పు
- "డాన్స్ ఆఫ్ ది హిల్లరీ" అనే ప్రమాదకర మాల్వేర్ వ్యాప్తి
- వ్యక్తిగత, బ్యాంకింగ్ సమాచారం దొంగిలించే ప్రమాదం
పాకిస్థానీ హ్యాకర్లు భారతీయ సోషల్ మీడియా యూజర్లపై ప్రభావం చూపేందుకు, వారి నుంచి కీలక సమాచారాన్ని సేకరించేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా 'డాన్స్ ఆఫ్ ది హిల్లరీ' మాల్వేర్ను ప్రయోగిస్తున్నట్లు సమాచారం. గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే వాట్సాప్ సందేశాలు, లింకుల ద్వారా ఈ మాల్వేర్ను ఫోన్లలోకి చొప్పించి, సమాచారాన్ని దొంగిలించే ప్రమాదం ఉందని నిపుణులు వివరిస్తున్నారు. వాట్సాప్తో పాటు ఫేస్బుక్, ఈమెయిల్స్ ద్వారా కూడా ఈ వైరస్ను వ్యాపింపజేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ 'డాన్స్ ఆఫ్ ది హిల్లరీ' మాల్వేర్ ఫోన్లోకి ప్రవేశిస్తే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. బ్యాంకింగ్ పాస్వర్డ్లు, క్రెడిట్/డెబిట్ కార్డు వివరాలు, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించవచ్చని వారు హెచ్చరించారు. ఫోన్లోని రహస్య ఫైళ్లను యాక్సెస్ చేసి, వాటిని లీక్ చేసే ప్రమాదం ఉందని చెప్పారు. మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ల వేగాన్ని తగ్గించడం లేదా పూర్తిగా క్రాష్ చేయడం చేయవచ్చని తెలిపారు. మన పరికరాలను రిమోట్గా వారి ఆధీనంలోకి తీసుకుని దుర్వినియోగం చేయవచ్చని హెచ్చరించారు.