Pakistan Drone Attacks: పాకిస్థాన్ డ్రోన్ దాడులు.. విమానాశ్రయాల్లో భద్రత పెంపు, స్కూల్స్, కాలేజీలకు సెలవు

- కంట్రోల్ రూంను ఏర్పాటు చేసిన పంజాబ్ ప్రభుత్వం
- అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ చేయాలంటూ ల్యాండ్ నెంబర్లు విడుదల
- విమానాశ్రయాల్లో అత్యున్నతస్థాయి భద్రత
- సరిహద్దు ప్రాంతాల్లో స్కూళ్లు, కాలేజీల మూసివేత
భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జమ్ము కశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలలో బ్లాక్ అవుట్ వాతావరణం ఏర్పడింది. జమ్ము విమానాశ్రయంతో పాటు పలు ప్రాంతాలను పాకిస్థాన్ లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. డ్రోన్ దాడులు జరుగుతున్నాయని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. రాజస్థాన్ లోని జైసల్మేర్‌లో పాకిస్థాన్ డ్రోన్‌ను భారత సైన్యం కూల్చివేసింది. అమృత్‌సర్‌లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అవసరమైన చర్యలు తీసుకునేందుకు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు సహాయం కోసం 0172-2741803, 0172-2749901 నంబర్లలో రెవెన్యూ విపత్తు నిర్వహణ పర్యవేక్షణ కేంద్రాన్ని సంప్రదించవచ్చని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు.
విమానాశ్రయాల్లో భద్రత కట్టుదిట్టం
కేంద్ర ప్రభుత్వం విమానాశ్రయాలు, విమానాలలో భద్రతను కట్టుదిట్టం చేసింది. విమానాశ్రయాల్లో ప్రయాణికులందరూ ప్రీ-బోర్డింగ్ చెక్ చేయించుకోవాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఆదేశించింది. టెర్మినల్‌లలోకి సందర్శకుల ప్రవేశాన్ని నిషేధించారు. అన్ని సీసీటీవీ కెమెరాలు పనిచేసే స్థితిలో ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలని విమానాశ్రయ నిర్వాహకులను ఆదేశించింది.
స్కూల్స్, కాలేజీలకు సెలవు
భారత్, పాకిస్థాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో జమ్ము, సాంబా, కథువా, రాజౌరి, పూంచ్ జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. బార్మర్, బికనీర్, శ్రీగంగానగర్, జైసల్మేర్ సహా రాజస్థాన్ సరిహద్దు జిల్లాల్లోని పాఠశాలలకు తదుపరి నోటిఫికేషన్ వచ్చే వరకు సెలవులు ప్రకటించారు.