శ్రీసిటీలో ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఏర్పాటుకు భూమి పూజ

  • మరికాసేపట్లో మంత్రి లోకేశ్‌ చేతుల మీదుగా శ్రీసిటీలో ‘ఎల్‌జీ’ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఏర్పాటుకు భూమిపూజ
  • రూ. 5,001 కోట్ల పెట్టుబడి.. 2 వేల ఉద్యోగావకాశాలు
  • రూ. 839 కోట్లతో ఐదు అనుబంధ యూనిట్లు ఏర్పాటు
  • మంత్రి లోకేశ్‌ అవిశ్రాంత కృషితో రాష్ట్రానికి మరో మెగా పెట్టుబడి 
  • యువగళం హామీలకు కార్యరూపం
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, యువతకు ఉపాధి కల్పన దిశగా మరో కీలక ముందడుగు పడనుంది. అంతర్జాతీయ గృహోపకరణాల తయారీ దిగ్గజం ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్, తిరుపతి సమీపంలోని శ్రీసిటీలో భారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ నూతన ప్లాంట్‌కు రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ మరికాసేపట్లో భూమిపూజ చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాబోయే ఆరేళ్లలో వివిధ దశల్లో మొత్తం రూ.5,001 కోట్ల పెట్టుబడి పెట్టాలని, తద్వారా సుమారు 2,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు కల్పించాలని ఎల్జీ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

ఎల్‌జీ సంస్థ శ్రీసిటీలో ఏర్పాటు చేయనున్న ఈ యూనిట్‌లో ప్రధానంగా ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండీషనర్‌లతో పాటు ఇతర అత్యాధునిక ఎలక్ట్రానిక్ పరికరాలను ఉత్పత్తి చేయనుంది. అంతేకాకుండా, ఉత్పత్తులకు అవసరమైన కంప్రెసర్, మోటార్ కంప్రెసర్, హీట్ ఎక్స్ఛేంజర్ వంటి కీలక విడిభాగాలను కూడా ఆంధ్రప్రదేశ్‌లోనే తయారుచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. 

ప్రధాన యూనిట్‌తో పాటు, రూ.839 కోట్ల వ్యయంతో మరో ఐదు అనుబంధ యూనిట్లను కూడా ఏర్పాటు చేయ‌నున్నారు. ఇక, మంత్రి లోకేశ్‌ అవిశ్రాంత కృషితో రాష్ట్రానికి ఎల్‌జీ రూపంలో ఈ మెగా పెట్టుబడి చేకూరింది. అలాగే ఈ ప్రాజెక్టు ఏర్పాటు ద్వారా ఆయ‌న‌ 'యువగళం' హామీలకు కార్యరూపం దాల్చిన‌ట్లైంది.   


More Telugu News