MS Dhoni: రిటైర్మెంట్‌పై ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు

Dhonis Interesting Comments on Retirement
షార్ట్స్‌లో చూడండి
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ తన ఐపీఎల్ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ జులైలో 44వ వసంతంలోకి అడుగుపెట్టనున్న తాను ఐపీఎల్ 2025 తన చివరి సీజన్ అవుతుందా లేదా అనే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఏడాదిలో కేవలం రెండు నెలల పాటు ఆడేందుకు, మిగిలిన ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు తన శరీరాన్ని సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందని, ఈ ఒత్తిడిని అది తట్టుకోగలదా లేదా అనేది చూడాలని అన్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. అభిమానుల నుంచి లభిస్తున్న ఆదరణ తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని పేర్కొన్నాడు. 

ప్రస్తుతం ధోనీ మోకాలి సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడని, అందువల్ల ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయలేకపోతున్నాడని సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ గతంలో చెప్పాడు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో డెవాల్డ్ బ్రెవిస్ ఔటయ్యాక 13వ ఓవర్లో క్రీజులోకి వచ్చిన ధోనీ.. శివమ్ దూబేకు సహకరిస్తూ చివర్లో కీలక సిక్సర్‌తో జట్టును గెలిపించారు.

ప్లేఆఫ్స్ రేసు నుంచి సీఎస్కే నిష్క్రమించిన నేపథ్యంలో మిగిలిన మ్యాచ్‌లను ఐపీఎల్ 2026 సీజన్ కోసం జట్టును సిద్ధం చేసేందుకు వినియోగించుకుంటున్నట్లు ధోనీ తెలిపాడు. యువ ఆటగాళ్లైన ఉర్విల్ పటేల్, డెవాల్డ్ బ్రెవిస్ వంటి వారికి అవకాశాలు కల్పిస్తున్నామన్నాడు. ఉర్విల్ పటేల్ తన అరంగేట్ర మ్యాచ్‌లోనే 11 బంతుల్లో 31 పరుగులు చేయగా, బ్రెవిస్ 22 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. "నెట్స్‌లో, ప్రాక్టీస్ మ్యాచ్‌లలో ఆటగాళ్లను చూడొచ్చు. కానీ అసలైన మ్యాచ్‌లో వారి ప్రతిభ, మానసిక దృఢత్వం బయటపడతాయి. సాంకేతికంగా అత్యుత్తమంగా ఉన్న బ్యాటర్ కంటే ఆటను అర్థం చేసుకుని, బౌలర్ వ్యూహాలను పసిగట్టగల మానసిక స్థైర్యం ఉన్నవారే రాణిస్తారు" అని ధోనీ అభిప్రాయపడ్డాడు. యువ ఆటగాళ్లలో ఈ లక్షణాలనే తాము అన్వేషిస్తున్నట్లు చెప్పాడు.
Go Back to Shorts
MS Dhoni
Dhoni Retirement
IPL 2025
Chennai Super Kings
CSK
Dhoni IPL Future
Stephen Fleming
DeWald Brevis
Urvil Patel
Indian Premier League

More Telugu News