Shehbaz Sharif: భారత్ దాడులతో పాకిస్థాన్‌లో తీవ్ర కలకలం: రెడ్ అలర్ట్

Pakistan put on red alert PM Shehbaz to address the nation in few hours
  • భారత్ వైమానిక దాడుల నేపథ్యంలో పాకిస్థాన్‌లో రెడ్ అలర్ట్
  • జాతినుద్దేశించి ప్రసంగం చేయనున్న ప్రధాని షెహబాజ్ షరీఫ్
  • జాతీయ భద్రతా కమిటీ సమావేశం
  • దాడుల్లో 26 మంది మృతి, 46 మందికి గాయాలైనట్టు పాక్ సైన్యం ప్రకటన
  • పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా దాడులు జరిగినట్లు భారత వర్గాల కథనం
  • మసూద్ అజర్, హఫీజ్ సయీద్ అనుమానిత స్థావరాలు లక్ష్యం
భారత వైమానిక దాడుల నేపథ్యంలో పాకిస్థాన్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం, ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మరికొన్ని గంటల్లో జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.

దేశంలోని ప్రభుత్వ ఆసుపత్రులను అత్యవసర సేవల కోసం సిద్ధం చేశారు. దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను కనీసం 24 నుంచి 36 గంటల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. రాజధాని ఇస్లామాబాద్‌తో పాటు పంజాబ్ ప్రావిన్స్‌లోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. సాయుధ బలగాలన్నీ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

మంగళవారం రాత్రి జరిగిన ఈ వైమానిక దాడుల్లో కనీసం 26 మంది మరణించారని, మరో 46 మంది గాయపడ్డారని పాకిస్థాన్ ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్‌పీఆర్) డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి తెలిపారు. 

పాకిస్థాన్‌ వెర్షన్ ప్రకారం ఆ దేశంలోని ఆరు వేర్వేరు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. వీటిలో పాకిస్థాన్‌లోని దక్షిణ పంజాబ్ ప్రావిన్స్‌లోని బహవల్‌పూర్ నగరానికి చెందిన అహ్మద్‌పూర్ షర్కియా ప్రాంతంలోని మసీదు సుభానల్లా కూడా ఉంది. ఇది జైషే మహ్మద్ (జెఈఎం) చీఫ్ మౌలానా మసూద్ అజర్ రహస్య స్థావరమని ఆరోపణలున్నాయి. అలాగే, లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ), జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్‌కు చెందిన మురిడ్కేలోని ప్రధాన కార్యాలయం, రహస్య స్థావరంతో పాటు ముజఫరాబాద్, కోట్లి, బాగ్ పట్టణాల్లోని ఇతర ప్రాంతాలపై కూడా పలు దాడులు జరిగినట్లు సమాచారం.

బుధవారం మధ్యాహ్నం జాతినుద్దేశించి ప్రసంగించనున్న పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, దేశంలో నెలకొన్న భద్రతా పరిస్థితిపై చర్చించేందుకు, భారత్‌పై భవిష్యత్ కార్యాచరణను రూపొందించేందుకు తన నివాసంలో జాతీయ భద్రతా కమిటీ (ఎన్‌ఎస్‌సీ) అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 


Shehbaz Sharif
Operation Sindoor
Pakistan
India
Air Strikes
Red Alert
National Security Committee
Terrorism
JeM
LeT
Surgical Strikes

More Telugu News