Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌లో ఆత్మాహుతి డ్రోన్లు వినియోగం

Operation Sindhoor
  • అత్యాధునిక అస్త్రాలతో విరుచుకుపడ్డ భారత్
  • ఆత్మాహుతి డ్రోన్లు, స్కాల్ప్ క్షిపణులు, హ్యామర్ బాంబులు వినియోగించినట్లుగా అంచనాలు
  • త్రివిధ దళాల అత్యంత సమన్వయంతో విజయవంతమైన ఆపరేషన్
పాకిస్థాన్‌ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైనిక దళాలు విరుచుకుపడ్డాయి. "ఆపరేషన్ సిందూర్" అనే సంకేత నామంతో చేపట్టిన ఈ అత్యంత కీలకమైన సైనిక చర్యలో, త్రివిధ దళాలు పాల్గొన్నాయి. ఈ ఆపరేషన్‌లో భాగంగా తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేశారు.

భారత సైనిక దళాలు ఈ రహస్య ఆపరేషన్ కోసం తమ అమ్ములపొదిలోని అత్యాధునిక అస్త్రశస్త్రాలను వినియోగించింది. సైనిక కార్యకలాపాల్లో వినియోగించిన ఆయుధాల వివరాలను అధికారికంగా వెల్లడించనప్పటికీ, లక్ష్యాలను ఛేదించిన తీరును బట్టి ఆత్మాహుతి డ్రోన్లు (లాయిటరింగ్ మ్యూనిషన్స్), స్కాల్ప్ (స్ట్రామ్‌షాడో) క్షిపణులు, హ్యామర్ తరహా స్మార్ట్‌ బాంబులను ప్రయోగించి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

ముఖ్యంగా, లక్ష్య నిర్దేశిత ప్రాంతాలకు చేరుకుని, శత్రువులను గుర్తించి, వారిపై దాడి చేయగల సామర్థ్యం ఉన్న ఆత్మాహుతి డ్రోన్లను ఈ దాడుల్లో ఉపయోగించి ఉంటారని భావిస్తున్నారు. వీటి ద్వారా మన దళాల వైపు ప్రాణనష్టం లేకుండా చూసుకున్నారు.

ఈ డ్రోన్లు నిర్దేశించిన ప్రాంతాలను చేరుకొని, లక్ష్యాలను గుర్తించి వాటిపై విరుచుకుపడతాయి. వీటిల్లో నిఘా సామర్థ్యాలు కూడా ఉంటాయి.

ఫ్రాన్స్ అభివృద్ధి చేసిన, సుమారు 250 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం ఛేదించగల స్కాల్ప్ దీర్ఘశ్రేణి క్రూయిజ్ క్షిపణులను రఫేల్ యుద్ధ విమానాల నుంచి ప్రయోగించి ఉండొచ్చని ఒక అంచనా. ఇవి శత్రు దేశంలోకి లోతుగా చొచ్చుకెళ్లి దాడులు చేయగలవు.

పటిష్టమైన బంకర్లను, బహుళ అంతస్తుల భవనాలను ధ్వంసం చేసేందుకు ఉపయోగపడే హ్యామర్ బాంబులను కూడా వినియోగించినట్లు భావిస్తున్నారు. ఈ స్మార్ట్ బాంబులను లక్ష్యానికి 50 నుంచి 70 కిలోమీటర్ల దూరం నుంచే ప్రయోగించవచ్చు.
Operation Sindoor
India
Pakistan

More Telugu News