Miss World 2025: హైదరాబాద్‌లో 'మిస్ వరల్డ్' సందడి.. చార్మినార్ వద్ద వ్యాపారాలు బంద్!

Miss World 2025 in Hyderabad Charminar Businesses Shut Down
  • మే 31 వరకు చౌమొహల్లా ప్యాలెస్‌లో మిస్ వరల్డ్-2025 పోటీలు
  • భద్రతా కారణాలతో చార్మినార్, పరిసర ప్రాంతాల్లో దుకాణాలు, వ్యాపారాల మూసివేత
  • నగరానికి చేరుకుంటున్న అందాల భామలు, మాజీ మిస్ వరల్డ్స్
హైదరాబాద్ నగరం మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ కార్యక్రమానికి వేదిక కానుంది. మే 10వ తేదీ నుంచి 31 వరకు చారిత్రక చౌమొహల్లా ప్యాలెస్ (ఖిల్వత్ ప్యాలెస్)లో 'మిస్ వరల్డ్-2025' పోటీలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, పోలీసులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేస్తున్నారు. ఇందులో భాగంగా చార్మినార్‌తో పాటు పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో దుకాణాలు, వ్యాపార సముదాయాలను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

సౌత్ జోన్ పోలీసులు ఈ కార్యక్రమానికి హాజరయ్యే విదేశీ ప్రతినిధులు, సందర్శకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక చర్యలు చేపట్టారు. చార్మినార్ చుట్టుపక్కల ఉన్న అన్నిరకాల తోపుడుబండ్ల దుకాణాలను తొలగిస్తున్నారు. రెండు రోజుల క్రితం చిరు వ్యాపారులతో సమావేశమైన పోలీసు అధికారులు, పోటీలు ముగిసే వరకు దుకాణాలు మూసివేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో చార్మినార్ వద్ద వ్యాపారులు ఈ రోజు తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. పాతబస్తీలోని ఇతర ప్రాంతాలలో కూడా పోలీసులు విస్తృతంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.

ఈ చర్యల వల్ల తమ వ్యాపారాలకు నష్టం వాటిల్లుతుందని స్థానిక వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ, భద్రతా కారణాల దృష్ట్యా పోలీసుల ఆదేశాలను పాటించక తప్పడం లేదని వారు పేర్కొంటున్నారు.

మరోవైపు, అతిథులు భాగ్యనగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉన్నందున భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. బీఎన్ఎస్ 2023లోని సెక్షన్ 163 ప్రకారం నగరంలోని పలు ప్రాంతాల్లో రిమోట్ కంట్రోల్ డ్రోన్లు లేదా పారా గ్లైడర్లు లేదా రిమోట్ కంట్రోల్డ్ మైక్రో లైట్ ఎయిర్ క్రాఫ్ట్‌లను ఎగురవేసేందుకు అనుమతి లేదని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.

మిస్ వరల్డ్-2025 పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి అందాల భామలు, మాజీ మిస్ వరల్డ్‌లు ఇప్పటికే హైదరాబాద్ నగరానికి చేరుకుంటున్నారు. విదేశీయుల భద్రత కోసం చార్మినార్, చౌమొహల్లా ప్యాలెస్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు.
Miss World 2025
Hyderabad
Charminar
Chowmahalla Palace
Security Measures
International Event
India
Tourism
Business Closure
CV Anand

More Telugu News