Kommareddy Pattabhiram: త్వరలో జగన్ రెడ్డికి కూడా అదే గతి పడుతుంది: పట్టాభిరామ్

Pattabhirams Strong Condemnation of YSRCPs Propaganda
  • యాక్సెస్ ఎనర్జీ ఒప్పందంపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్న పట్టాభిరామ్
  • గత ప్రభుత్వం యూనిట్‌కు రూ.5.12కు ఒప్పందం
  • తాము రూ.4.60కే కుదుర్చుకున్నామని వెల్లడి
  • ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్ర ఖజానాకు రూ.2,719 కోట్ల ఆదా
  • ప్రజాధనం ఆదా చేయడం జగన్‌కు నేరమా అని ప్రశ్న
యాక్సెస్ రెన్యువబుల్ ఎనర్జీ ఒప్పందం విషయంలో వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. గత ప్రభుత్వం కంటే తక్కువ ధరకే తాము ఒప్పందం కుదుర్చుకుని రాష్ట్ర ఖజానాకు రూ.2,719 కోట్లు ఆదా చేశామని ఆయన స్పష్టం చేశారు. జగన్ రెడ్డి బుద్ది ఎలాంటిదో ప్రజలు తెలుసుకోవాలి.. వాస్తవాలను గ్రహించాలని అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

గత వైసీపీ ప్రభుత్వం 2022 నవంబర్ 24న యాక్సెస్ రెన్యువబుల్ ఎనర్జీ సంస్థతో యూనిట్‌కు రూ.5.12 చొప్పున ఒప్పందం కుదుర్చుకుందని, తాము అధికారంలోకి వచ్చాక దానిని యూనిట్‌కు రూ.4.60కే సవరించి, తద్వారా రూ.2,719 కోట్లు ఆదా చేశామని పట్టాభిరామ్ వివరించారు. వైసీపీ నేతలు తమ కుంభకోణాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, వారంతా 'జైల్‌మేట్స్' అని, మళ్లీ అక్కడికే వెళతారని వ్యాఖ్యానించారు.

యాక్సెస్ రెన్యువబుల్ ఎనర్జీ ఒప్పందాలపై జగన్ రెడ్డి పకోడి ఛానెల్, కరపత్రికలో విషం చిమ్ముతూ అబద్దాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలపై భారం పడకుండా రూ. 2,719 కోట్లు తగ్గించడం జగన్ రెడ్డికి నేరమా? అని ప్రశ్నించారు. రకరకాల కుంభకోణాల్లో వైసీపీ నేతలు తిన్నదంతా బయటకు వస్తుందని.. జగన్ రెడ్డికి గతంలో ఆత్మగా వ్యవహరించిన వ్యక్తికి నేడు పట్టిన గతే జగన్ రెడ్డికి కూడా త్వరలో పడుతుంది.. వారందరూ త్వరలోనే జైల్లో సంతోషంగా కలుసుకొని కబుర్లు చెప్పుకోవచ్చని పట్టాభి ఎద్దేవా చేశారు.

ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఏపీఈఆర్సీ) ఆదేశాల మేరకే ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్లపై నిర్ణయాలు తీసుకుంటోందని పట్టాభిరామ్ తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం పాత విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను (పీపీఏ) రద్దు చేస్తూ జీవో ఇచ్చి, కేంద్రం అక్షింతలు వేశాక, పలు కంపెనీలు కోర్టుకెళ్లాయని గుర్తుచేశారు. 

చివరికి, 2022 ఆగస్టులో పాత ఒప్పందాలను కొనసాగిస్తామని హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి, అదే ఏడాది నవంబర్‌లో యాక్సెస్ సంస్థతో ఏపీఈఆర్సీ నిర్ణయించిన రూ.5.12 ధరకే పీపీఏ కుదుర్చుకుందని ఆధారాలతో సహా వివరించారు. తాము యూనిట్ ధరను రూ.4.60కి తగ్గించి ఒప్పందం చేసుకుంటే వైసీపీ నేతలు ఎలా ప్రశ్నిస్తారని సవాల్ విసిరారు.

ప్రస్తుత మార్కెట్ ధరల కంటే ఎక్కువ రేటుకు పీపీఏ చేసుకున్నామన్నది అవాస్తవమని, ఫర్మ్ అండ్ డిస్పాచబుల్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టుల ధరల కంటే తాము చేసుకున్న పీపీఏ రేటు తక్కువేనని స్పష్టం చేశారు. బ్యాటరీ స్టోరేజ్ బాధ్యత, ఖర్చు డెవలపర్‌దేనని ఏపీఈఆర్సీ తీర్పులో స్పష్టంగా ఉందని గుర్తుచేశారు. 

గత ప్రభుత్వం 2022-23లో సాయంత్రం పీక్ అవర్స్‌లో యూనిట్‌ను రూ.11.78 వరకు, సగటున రూ.9.30కు కొనుగోలు చేసిందని, అలాంటిది తాము రూ.4.60కే ఒప్పందం చేసుకోవడం తప్పా అని నిలదీశారు. చంద్రబాబు రాష్ట్ర హితం కోసమే ఆలోచిస్తారని, ప్రజలపై భారం మోపకుండా పాలన చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని పట్టాభిరామ్ పేర్కొన్నారు.
Kommareddy Pattabhiram
Jagan Mohan Reddy
YSRCP
TDP
Andhra Pradesh
Renewable Energy
Power Purchase Agreement
Electricity Prices
APERC
Access Renewable Energy

More Telugu News