ఉగ్రదాడి గురించి మోదీకి 3 రోజుల ముందే తెలుసు.. అందుకే కశ్మీర్ పర్యటన రద్దు చేసుకున్నారు: ఖర్గే సంచలన ఆరోపణలు

  • ఇంటెలిజెన్స్ నివేదిక అందినప్పుడు చర్యలు ఎందుకు తీసుకోలేదన్న ఖర్గే
  • ఖర్గే వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన బీజేపీ
  • ఖర్గేని ఆధునిక  మీర్ జాఫర్ గా అభివర్ణించిన కేశవన్
భారత ప్రధాని మోదీపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు. జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి గురించి మోదీకి మూడు రోజుల ముందే సమాచారం అందిందని ఆయన తెలిపారు. ఈ నిఘా నివేదిక కారణంగానే ప్రధాని తన కశ్మీర్ పర్యటనను రద్దు చేసుకున్నారని ఆయన ఆరోపించారు. జార్ఖండ్‌లోని రాంచీలో జరిగిన 'సంవిధాన్ బచావో ర్యాలీ'లో ఖర్గే ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. "నిఘా వైఫల్యం జరిగిందని ప్రభుత్వం అంగీకరించింది, దాన్ని పరిష్కరిస్తామని కూడా చెప్పింది. ఒకవేళ వారికి ముందే ఈ విషయం తెలిస్తే, ఎందుకు తగిన చర్యలు తీసుకోలేదు? పహల్గామ్ దాడికి మూడు రోజుల ముందే ప్రధాని మోదీకి ఇంటెలిజెన్స్ నివేదిక అందిందని, అందుకే ఆయన తన కశ్మీర్ పర్యటనను రద్దు చేసుకున్నారని నేను వార్తాపత్రికల్లో చదివాను. ఇంటెలిజెన్స్ నివేదిక అందినప్పుడు భద్రతాబలగాలను ఎందుకు అలర్ట్ చేయలేదు?" అని ఖర్గే ప్రశ్నించారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఖర్గే చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

మల్లికార్జున ఖర్గే చేసిన ఆరోపణలపై బీజేపీ నేత సీఆర్ కేశవన్ తీవ్రంగా స్పందించారు. ఖర్గే వ్యాఖ్యలను ఆధునిక మీర్ జాఫర్ చేసిన ద్రోహపూరిత ప్రకటనలుగా ఆయన అభివర్ణించారు. ప్రధానమంత్రిపై ఆయన చేసినవి విషపూరితమైన, నిరాధారమైన ఆరోపణలని, ఇవి తీవ్రంగా ఖండించదగినవని, క్షమించరానివని కేశవన్ అన్నారు. ఖర్గే తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.


More Telugu News

Mallikarjun Kharge Narendra Modi Pulwama Attack Kashmir Visit Intelligence Report Terrorist Attack BJP Congress India-Pakistan Tension CR Keshavan