అంతకంటే కష్టం ఏముంటుంది?: నటుడు బాబూ మోహన్

  • నేను ఎవరికి సారీ చెప్పను 
  • థ్యాంక్స్ చెప్పాల్సి వస్తే వారికే చెబుతాను
  • హీరోలంతా నన్ను అభిమానించేవారు  
  • కొడుకు పోవడం కంటే మించిన కష్టం ఏముంటుందన్న బాబూ మోహన్

బాబూ మెహన్ .. ఒకానొక దశలో వెండితెరపై ఒక వెలుగు వెలిగిన హాస్యనటుడు. తనదైన మేనరిజమ్స్ తో .. బాడీ లాంగ్వేజ్ తో ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఆయన సొంతం చేసుకున్నారు. అలాంటి బాబూ మోహన్ ప్రస్తుతం అటు సినిమాలకు .. ఇటు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా 'బిగ్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. 

"ఒకప్పుడు 'రవీంద్రభారతి' బయట నిలబడి, అందులో నాటికలు చూస్తే చాలని అనుకునేవాడిని. అలాంటి రవీంద్రభారతిలో నాకు అనేక సార్లు సన్మానాలు జరిగాయి. ఇప్పటి సీనియర్ స్టార్ హీరోలందరితోను కలిసి నేను నటించాను. వాళ్లంతా కూడా నన్ను ఎంతో అభిమానంతో .. గౌరవంతో చూసుకున్నారు. ఇప్పటికీ నేను ఎక్కడ కనిపించినా ఎంతో ఆత్మీయంగా పలకరిస్తూ ఉంటారు" అని అన్నారు. 

"నేను .. కోట శ్రీనివాసరావు కలిసి చాలా సినిమాలలో నటించాము. రేలంగి - రమణారెడ్డి, అల్లు రామలింగయ్య - రావు గోపాలరావు మాదిరిగా మా జోడీకి గుర్తింపు రావడం మేము చేసుకున్న అదృష్టం క్రింద భావిస్తూ ఉంటాము. నేను ఎవరి మనసు కష్టపెట్టలేదు గనుక ఎవరికీ సారీ చెప్పను. తొలినాళ్లలో నన్ను ఎంకరేజ్ చేసిన దర్శకులకు థ్యాంక్స్ చెప్పుకుంటాను" అని అన్నారు. 

"నాకు కష్టం వస్తే .. ముందుగా దేవుడికే చెప్పుకుంటాను. మా పెద్దబ్బాయి ప్రమాదంలో పోయినప్పుడు, ఎందుకు ఇలా చేశావని దేవుడిని నిలదీశాను. ఆ తరువాత నేను నా కష్టాన్ని ఎవరికీ చెప్పుకోలేదు. ఎందుకంటే కొడుకుపోయిన కష్టానికి మించిన కష్టం ఏముంటుంది" అంటూ ఉద్వేగానికి లోనయ్యారు.



More Telugu News

Baboo Mohan Telugu Actor Comedian Kotha Srinivasa Rao Telugu Cinema Tollywood Interview Big TV Veteran Actor Film Career