Chandrababu Naidu: ఏపీ సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు .. నేటి సాయంత్రం లోగా వారికి ఆర్ధిక సాయం

Chandrababu Naidu Orders Immediate Financial Aid to Andhra Pradesh Farmers
  • అకాల వర్షాలు, పంటల నష్టంపై నిన్న సచివాలయ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు
  • పంట నష్టపోయిన రైతులకు మంగళవారం సాయంత్రంలోగా సాయం అందించాలని ఆదేశం
  • పిడుగుపాటు మృతులకు పరిహారం అందించాలని ఆదేశించిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో అకాల వర్షాల కారణంగా రైతులు భారీగా పంట నష్టపోయారు. పిడుగుపాటుకు గురై పది మంది మరణించగా, పశువులు కూడా మృతి చెందాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలో అకాల వర్షాలు, పంట నష్టంపై నిన్న సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పంట నష్టపోయిన రైతులకు మంగళవారం సాయంత్రంలోగా పెట్టుబడి సాయం అందించాలని ఆదేశించారు. అలాగే, పిడుగుపాటు కారణంగా మృతి చెందిన పది మంది కుటుంబాలకు తక్షణమే పరిహారం అందజేయాలని తెలిపారు. పిడుగుపాటుకు చనిపోయిన పశువులకు నిబంధనల ప్రకారం సాయం విడుదల చేయాలని ఆదేశించారు.

అకాల వర్షాలతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 2,224 హెక్టార్లలో వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయని, 138 హెక్టార్లలో అరటి, బొప్పాయి, మామిడి తదితర ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ముఖ్యమంత్రికి నివేదిక అందజేశారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో 1,033 హెక్టార్లు, నంద్యాలలో 641, కాకినాడలో 530, శ్రీసత్యసాయి జిల్లాలో 20 హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లిందని తెలిపారు. కృష్ణా, ఏలూరు, కాకినాడ, ఎన్టీఆర్, తిరుపతి, నంద్యాల, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని అధికారులు వివరించారు. 
Chandrababu Naidu
Andhra Pradesh
farmers
crop loss
unseasonal rains
financial aid
lightning strikes
compensation
AP government
agriculture

More Telugu News