Undavalli Arun Kumar: సీఎం అయిన వెంటనే జగన్ కు చెప్పా... ఆయన నా మాట వినలేదు: ఉండవల్లి అరుణ్ కుమార్

- కక్ష సాధింపులు వద్దని జగన్ కు చెప్పానన్న ఉండవల్లి
- డీజీ స్థాయి అధికారిని జైల్లో పెట్టడం ఇదే తొలిసారి అన్న మాజీ ఎంపీ
- భారత్ తో యుద్ధం చేసే శక్తి పాకిస్థాన్ కు లేదని వ్యాఖ్య
కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దని జగన్ సీఎం అయిన వెంటనే తాను ఆయనకు సలహా ఇచ్చినట్లు ఉండవల్లి తెలిపారు. తన సూచనను జగన్ పట్టించుకోదని అన్నారు. తప్పు చేస్తే జగన్ పై కేసు పెట్టాలే కానీ, అధికారులను ఇబ్బంది పెట్టకూడదని కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. డీజీ స్థాయి అధికారి అయిన పీఎస్ఆర్ ఆంజనేయులు జైలుకు వెళ్లారని.. తాను ములాఖత్ లో ఆయనను పరామర్శించానని వెల్లడించారు. డీజీ స్థాయి అధికారిని జైల్లో పెట్టడం ఇదే మొదటిసారి అని అన్నారు. తనకు అనేకమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో స్నేహం ఉందని తెలిపారు. జగన్ తప్పు చేస్తే ఆయనపై కేసు నమోదు చేయాలని... అధికారులను ఇబ్బంది పెట్టవద్దని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం చెల్లదంటూ తాను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఉండవల్లి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు విషయంలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవ చూపాలని చెప్పారు. పవన్ కల్యాణ్ ఈ కేసుకు ఒక ఆశాజ్యోతి అని తాను భావిస్తున్నట్లు ఉండవల్లి పేర్కొన్నారు.
ఏపీ విభజన జరిగి, తాను సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి 11 ఏళ్లు గడిచినా, కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఈ కేసులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయలేదని ఉండవల్లి గుర్తుచేశారు. 2014 ఫిబ్రవరి 18న పార్లమెంట్‌లో బిల్లు సక్రమంగా ఆమోదం పొందకుండానే రాష్ట్రాన్ని విభజించారని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నట్లు తెలిపారు. విభజన తీరును తప్పుబడుతూ, చట్టబద్ధతను నిర్ధారించాలని కోరుతూ తన పిటిషన్‌లో మార్పులు చేసి మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు వివరించారు. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి, ఒక సీనియర్ న్యాయవాదిని నియమించి సుప్రీంకోర్టులో చురుగ్గా వాదనలు వినిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై ఇప్పటికే పవన్ కు లేఖ రాసినట్లు కూడా ఉండవల్లి వెల్లడించారు.
కశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిని ప్రపంచ దేశాలన్నీ ఖండిస్తున్నాయని ఉండవల్లి అన్నారు. ఉగ్రవాదాన్ని అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అందరూ మద్దతు ఇవ్వాలని సూచించారు. భారతదేశంతో యుద్ధం చేసే శక్తి పాకిస్థాన్‌కు లేదని, యుద్ధం వస్తే పాకిస్థానే ఎక్కువగా నష్టపోతుందని అభిప్రాయపడ్డారు. మతం ఆధారంగా విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదని, భారతదేశంలో 12 శాతం ముస్లింలు ఉంటే, పాకిస్థాన్‌లో హిందువులు ఒక శాతం మాత్రమే ఉన్నారని గుర్తుచేశారు. అందరూ పాకిస్థాన్ చర్యలను వ్యతిరేకించాలని చెప్పారు.