Hashim Musa: సైనిక శిక్షణ ఇచ్చి మరీ పంపిందట.. పహల్గామ్ ఉగ్రదాడి వెనక పాక్ కుట్ర

Pakistans Role in Pahalgham Terror Attack Revealed
  • పహల్గామ్ సూత్రధారి హషీం మూసాకు పాక్ ఆర్మీ ట్రైనింగ్!
  •  మూసా కోసం పెద్ద ఎత్తున గాలింపు చేపట్టిన భద్రతా బలగాలు
  •  ఆచూకీ చెప్పిన వారికి రూ.20 లక్షల రివార్డు ప్రకటన
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు పాకిస్థాన్ సైన్యం ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పాకిస్థాన్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ (ఎస్ఎస్ జీ)  అత్యున్నత శిక్షణ ఇచ్చి మరీ ఉగ్రవాదులను భారత్ లోకి పంపించిందని దర్యాప్తులో తేలింది. ఇప్పటికే అదుపులోకి తీసుకున్న ఉగ్రవాదులను విచారించగా ఈ విషయం బయటపడినట్లు అధికారులు తెలిపారు.

దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఒకడైన హషీం మూసా గతంలో పాకిస్థాన్ ఎస్ఎస్ జీలో పారాకమాండోగా పనిచేసినట్లు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత లష్కరే తోయిబాలో చేరిన మూసా.. పలు ఉగ్రదాడుల్లో కీలక పాత్ర పోషించాడు. 2023లో భారత్‌లోకి ప్రవేశించిన మూసా జమ్మూకశ్మీర్‌లో జరిగిన కనీసం ఆరు దాడుల్లో పాల్గొన్నట్లు సమాచారం. గతంలో గందర్‌బల్‌లో ఏడుగురి మృతికి కారణమైన దాడి, బారాముల్లాలో నలుగురు భద్రతా సిబ్బంది మరణించిన ఘటనలోనూ మూసా ప్రమేయం ఉందని అధికారులు తెలిపారు.

ప్రస్తుతం హషీం మూసా దక్షిణ కశ్మీర్‌లోని దట్టమైన అటవీ ప్రాంతంలో దాక్కుని ఉండవచ్చని భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి. అతన్ని పట్టుకునేందుకు భారీ ఆపరేషన్ ప్రారంభించాయి. మూసా ఆచూకీ తెలిపిన వారికి రూ.20 లక్షల నగదు బహుమతి ఇస్తామని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని జమ్మూకశ్మీర్ పోలీసులు ప్రకటించారు.
Hashim Musa
Pakistan Army
Special Services Group
Lashkar-e-Taiba
Jammu and Kashmir
Pahalgham attack
Terrorism
India-Pakistan
Counter-terrorism

More Telugu News