లోన్ యాప్ వేధింపులకు అంతేలేదా?.. ఏపీలో మరో యువకుడి ఆత్మహత్య

––
తెలుగు రాష్ట్రాలలో లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలకు అంతే లేకుండా పోయింది. అత్యవసరంలో డబ్బు తీసుకున్న పాపానికి ఆత్మహత్య చేసుకునే దాకా వేధింపులకు గురిచేస్తుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఏపీలో మరో యువకుడు ఈ లోన్ యాప్ భూతానికి బలయ్యాడు. గంటగంటకూ ఫోన్ చేసి డబ్బులు కట్టాలంటూ వేధింపులకు గురిచేయడంతో తట్టుకోలేక పురుగులమందు తాగి చనిపోయాడు.

అన్నమయ్య జిల్లాకు చెందిన శ్రీకాంత్ అనే యువకుడు కొంతకాలం క్రితం లోన్ యాప్ ద్వారా అప్పు తీసుకున్నాడు. వాయిదాలు సక్రమంగా, సమయానికి కట్టేస్తూ వచ్చాడు. అయితే, ఇటీవల ఓ వాయిదా కట్టడంలో ఆలస్యమైంది. దీంతో లోన్‌యాప్ నిర్వాహకులు శ్రీకాంత్ ను వేధించడం ప్రారంభించారు. గంటకోసారి ఫోన్ చేసి డబ్బులు చెల్లించాలని బెదిరించారు.

అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో మనస్తాపం చెందిన శ్రీకాంత్ పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తమ కుమారుడి ఆత్మహత్యకు కారణం లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులేనని శ్రీకాంత్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు లోన్ యాప్ నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. లోన్ యాప్ వేధింపులకు గురవుతున్న వారు తమను సంప్రదించాలని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు.


More Telugu News