Mohamed Muizzu: ప్రపంచ రికార్డు సృష్టించిన మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు

Maldives President Muizzu Sets New World Record for Longest Press Conference
  • ముయిజ్జు రికార్డు స్థాయి ప్రెస్ మీట్
  • దాదాపు 15 గంటల పాటు కొనసాగిన సమావేశం
  • ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ 14 గంటల రికార్డు బద్దలు
  • ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా కార్యక్రమం
మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు సుదీర్ఘ మీడియా సమావేశం నిర్వహించి సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పారు. శనివారం జరిగిన ఈ సమావేశం దాదాపు 15 గంటల పాటు నిర్విరామంగా సాగినట్లు ఆయన కార్యాలయం ఆదివారం ప్రకటించింది. ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ పేరిట ఉన్న రికార్డును ముయిజ్జు అధిగమించారు.

స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ మీడియా సమావేశం, అర్ధరాత్రి దాటిన తర్వాత ముగిసింది. 46 ఏళ్ల ముయిజ్జు మొత్తం 14 గంటల 54 నిమిషాల పాటు మాట్లాడారు. మధ్యలో కేవలం ప్రార్థనల కోసం మాత్రమే స్వల్ప విరామాలు తీసుకున్నారని అధ్యక్ష కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో దాదాపు రెండు డజన్ల మంది పాత్రికేయులతో పాటు, ప్రజలు అడిగిన ప్రశ్నలకు కూడా ముయిజ్జు సమాధానాలు ఇచ్చారు. సుదీర్ఘ సమయం పాటు సాగిన ఈ కార్యక్రమానికి హాజరైన జర్నలిస్టులకు ఆహార ఏర్పాట్లు కూడా చేశారు.

ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని (శనివారం) పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు మాల్దీవుల ప్రభుత్వం వెల్లడించింది. ఈ సందర్భంగా ముయిజ్జు మాట్లాడుతూ.. పత్రికల ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. వాస్తవాలను సమతుల్యతతో, నిష్పాక్షికంగా రిపోర్ట్ చేయాలని మీడియాకు పిలుపునిచ్చారు. 2025 వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో మాల్దీవుల ర్యాంకు 104కు (రెండు స్థానాలు మెరుగుపడి) చేరడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. 2023లో అధికారంలోకి వచ్చిన ముయిజ్జు పారదర్శకతకు, మీడియాతో స్వేచ్ఛాయుత చర్చలకు తన ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పడానికి ఈ రికార్డు స్థాయి సమావేశమే నిదర్శనమని ఆయన కార్యాలయం పేర్కొంది.

జెలెన్‌స్కీ రికార్డు బద్దలు
2019లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ 14 గంటల పాటు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి రికార్డు సృష్టించారు. అంతకుముందు బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో ఏడు గంటలకు పైగా ప్రెస్ మీట్ నిర్వహించిన రికార్డు ఉండేది. కాగా, ముయిజ్జు అధికారంలోకి రాకముందు, ఆయన నేతృత్వంలోని పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్‌సీ) పార్టీ, అంతకు ముందున్న మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ (ఎండీపీ) ప్రభుత్వం ఇతర దేశాలతో, ముఖ్యంగా భారత్‌తో కుదుర్చుకున్న ఒప్పందాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఒప్పందాలు దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తాయని ముయిజ్జు, ఆయన పార్టీ నేతలు గతంలో ఆరోపించారు.

భారత ప్రజలకు క్షమాపణలు చెప్పాలి
తాజాగా ముయిజ్జు చేసిన వ్యాఖ్యలపై (భారత్‌తో ఒప్పందాలపై తీవ్ర ఆందోళనలు ఏమీ లేవని చెప్పినట్లు వచ్చిన వార్తలపై) మాజీ విదేశాంగ మంత్రి, ప్రతిపక్ష ఎండీపీ నేత అబ్దుల్లా షాహిద్ స్పందించారు. 2023 ఎన్నికల ప్రచారంలో ఒప్పందాలపై తప్పుడు ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చిన ముయిజ్జు, ఇప్పుడు మాల్దీవులు, భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలని షాహిద్ డిమాండ్ చేశారు. "సంవత్సరాల తరబడి తప్పుడు వాదనలు చేసిన తర్వాత, ఇప్పుడు భారత్‌తో ఒప్పందాలపై తీవ్ర ఆందోళనలు లేవని ముయిజ్జు అంగీకరించారు. ఈ ఒప్పందాలు మన సార్వభౌమాధికారానికి, ప్రాదేశిక సమగ్రతకు ముప్పు అని ప్రచారం చేసి ఆయన 2023 అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారు" అని షాహిద్ ‘ఎక్స్’  వేదికగా విమర్శించారు.
Mohamed Muizzu
Maldives President
World Record
Press Conference
Zelenskyy
Longest Press Conference
World Press Freedom Day
India-Maldives Relations
Abdulla Shahid
Maldivian Politics

More Telugu News