PM Modi: యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీపై ప్ర‌ధాని మోదీ ప్ర‌శంస‌ల జ‌ల్లు

PM Modi Praises Young Sensation Vaibhav Suryavanshi
  • బీహార్‌లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించిన ప్ర‌ధాని
  • చిన్న వ‌య‌సులోనే అద్భుతంగా రాణిస్తున్న వైభ‌వ్‌ను మెచ్చుకున్న మోదీ
  • ఐపీఎల్‌లో బీహార్ బిడ్డ వైభ‌వ్ సూర్య‌వంశీ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చూశాన‌ని ప్ర‌శంస‌
  • వైభ‌వ్ ప్ర‌ద‌ర్శ‌న వెనుక ఎంతో శ్ర‌మ దాగి ఉందన్న ప్ర‌ధాని మోదీ
రాజ‌స్థాన్ రాయ‌ల్స్ (ఆర్ఆర్‌) ఫ్రాంచైజీకి ఆడుతున్న యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. 14 ఏళ్ల ఈ చిచ్చ‌ర‌పిడుగు ఐపీఎల్‌లో గుజ‌రాత్ టైటాన్స్ (జీటీ)పై 35 బంతుల్లోనే శ‌త‌కం న‌మోదు చేసి, రికార్డు సృష్టించిన విష‌యం తెలిసిందే. ఐపీఎల్ హిస్ట‌రీలోనే ఇది రెండో ఫాస్టెస్ట్ సెంచ‌రీ. దీంతో చిన్న వ‌య‌సులోనే అద్భుతంగా రాణిస్తున్న వైభ‌వ్‌ను తాజాగా ప్ర‌ధాని మెచ్చుకున్నారు. 

బీహార్‌లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను మోదీ వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని వీడియో కాన్ఫ‌రెన్సింగ్ ద్వారా మాట్లాడుతూ.. "ఐపీఎల్‌లో బీహార్ బిడ్డ వైభ‌వ్ సూర్య‌వంశీ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చూశా. చిన్న వ‌య‌సులో గొప్ప రికార్డు నెల‌కొల్పాడు. అద్భుత‌మైన ఘ‌న‌త‌ను న‌మోదు చేశాడు. సూర్యవంశీ దేశం మొత్తం దృష్టిని ఆకర్షించాడు. వైభ‌వ్ ప్ర‌ద‌ర్శ‌న వెనుక ఎంతో శ్ర‌మ దాగి ఉంది. మునుముందు అత‌డు మ‌రింత బాగా ఆడి, మ‌రిన్ని రికార్డులు సాధించాల‌ని కోరుకుంటున్నాను. క్రీడాకారులు ఎంత ఎక్కువ‌గా ఆడితే అంత బాగా మెరుగుప‌డ‌తారు" అని మోదీ అన్నారు. 

వైభ‌వ్ సూర్య‌వంశీ 35 బంతుల్లో శ‌త‌కం..
రాజస్థాన్‌లోని సవాయి మాన్‌సింగ్ స్టేడియంలో ఏప్రిల్ 28న గుజరాత్ టైటాన్స్ తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో, రాజస్థాన్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ వైభవ్ సూర్యవంశీ కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేసి టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు. 35 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సర్లతో 100 పరుగులు పూర్తి చేసుకున్న వైభవ్, ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రెండవ ఆటగాడిగా నిలిచాడు. 

అంతేగాక‌ ఐపీఎల్, టీ20 క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన శ‌త‌కం బాదిన‌ అతి పిన్న వయస్కుడిగా వైభవ్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. అలాగే కేవలం 14 సంవత్సరాల 32 రోజుల వయసులో ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడిన వైభవ్ క్రికెట్ చరిత్రలో ఏ ఫార్మాట్‌లోనైనా సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా కూడా గుర్తింపు పొందాడు.  
PM Modi
Vaibhav Suryavanshi
IPL
Fastest Century
Rajasthan Royals
Gujarat Titans
T20 Cricket
Record
Narendra Modi
Youngest Centurion
BCCI

More Telugu News