Shubman Gill: గిల్ పై ఒక మ్యాచ్ వేటు తప్పేలా లేదుగా.. అంపైర్ తో వాగ్వాదం ఎఫెక్ట్

--
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పై ఒక మ్యాచ్ వేటు పడడం తప్పేలా లేదని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో గిల్ ఫీల్డ్ అంపైర్లతో రెండుసార్లు వాగ్వాదానికి దిగాడు. తాను ఔట్ అయినప్పుడు ఒకసారి, అభిషేక్ శర్మ ఎల్బీడబ్ల్యూ విషయంలో మరోసారి అంపైర్ తో వాదనకు దిగాడు. అంపైర్ నిర్ణయంపై బాహాటంగానే నిరసన వ్యక్తం చేశాడు. దీంతో గిల్ పై వేటు తప్పకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఐసీసీ నిబంధనల ప్రకారం..
ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.8 ప్రకారం.. అంపైర్లు తీసుకునే నిర్ణయంపై తీవ్రంగా నిరసన తెలపడం, ఆటను అడ్డుకునేందుకు ప్రయత్నించడం, క్రీజ్‌లో నుంచి వెళ్లిపోవడం, తలను తీవ్ర స్థాయిలో ఊపుతూ నిరసన వ్యక్తంచేయడం, ఎల్బీడబ్ల్యూ ఇచ్చినప్పుడు ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకొందని చెప్పేలా చూపించడం, క్యాచ్ పట్టినప్పుడు బంతి బ్యాట్‌కు తగల్లేదని.. ప్యాడ్లకు, భుజానికి తాకిందని పదేపదే చెప్పడం, అంపైర్ నుంచి దూకుడుగా టోపీని లాక్కోవడం, అంపైర్ ఇచ్చిన నిర్ణయంపై తీవ్రస్థాయిలో చర్చించడం.. వంటివి చేస్తే సదరు ఆటగాడిపై చర్యలు తీసుకోవచ్చు. గిల్ ఇందులో రెండు తప్పులు చేసినట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
దీంతో హెచ్చరికతో సరిపెట్టవచ్చు లేదా గిల్ కు మ్యాచ్ ఫీజులో 50 శాతం లోపు జరిమానా విధించవచ్చు. దీంతో పాటు ఒకటి లేదా రెండు డీమెరిట్ పాయింట్లు విధించే అవకాశం ఉంది. ఇక రెండో తప్పిదానికి ఒక సస్పెన్షన్ పాయింట్, మ్యాచు ఫీజులో 50 నుంచి 100 శాతం జరిమానా, మూడు డీమెరిట్ పాయింట్లు విధించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

