CIA Recruitment: చైనా రహస్యాలు రాబట్టేందుకు అమెరికా కొత్త ఎత్తుగడ

CIA Invites Chinese Officials Viral Recruitment Videos
  • జిన్ పింగ్ పాలనలో అణచివేతను ఎదుర్కొంటున్న ఉద్యోగులే టార్గెట్
  • సీఐఏలో చైనీయుల నియామకానికి నోటిఫికేషన్
  • యూట్యూబ్, ట్విట్టర్ లో వైరల్ గా మారిన సీఐఏ వీడియోలు
చైనాలో ఎంత పెద్ద అధికారి అయినా సరే భయంభయంగానే బతకాల్సిన పరిస్థితి.. నిన్నటి దాకా అధ్యక్షుడు జిన్ పింగ్ కు కుడిభుజంలా వ్యవహరించిన వ్యక్తి ఈ రోజు హఠాత్తుగా కనిపించకుండా పోతాడు. ఆ వ్యక్తి ఏమయ్యాడనేది ఎవరికీ తెలియదు. దాని గురించి మాట్లాడితే తమకూ అదే గతి పడుతుందని మిగతావారు భయపడుతుంటారు. సాధారణ ఉద్యోగులతో పాటు ఉన్నత స్థానంలో ఉన్న వారిపైనా అణచివేత కొనసాగుతోంది. ఈ అణచివేతను అమెరికా గూఢచర్య సంస్థ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (సీఐఏ) తనకు అవకాశంగా మలచుకోవాలని ప్రయత్నిస్తోంది.

జిన్ పింగ్ పాలనలో అణచివేతకు గురవుతున్న అధికారులకు సీఐఏ ఆహ్వానం పలుకుతోంది. సీఐఏలో చేరాలని పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా రెండు వీడియోలను రూపొందించి యూట్యూబ్ లో విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ గా మారాయి. గంటల వ్యవధిలోనే 50 లక్షల మందికి పైగా ఈ వీడియోలను చూసినట్లు సమాచారం. చైనీయులను ఆకట్టుకునేందుకు ‘రండి.. మాతో కలిసి పనిచేయండి’ అంటూ మాండరిన్‌ భాషలో ఈ వీడియోలను రూపొందించింది. సైనిక పరంగా, వ్యూహాత్మకంగా చైనా తమకు అతిపెద్ద విరోధిగా అగ్రరాజ్యం భావిస్తోంది.

చైనా చేపడుతున్న రహస్య ఆపరేషన్ల గుట్టు తెలుసుకోవడానికే ఈ నియామకం చేపట్టామని సీఐఏ డైరెక్టర్‌ జాన్‌ రాట్‌క్లిఫ్‌ బహిరంగంగానే వెల్లడించారు. ‘‘సీఐఏలో మానవ వనరులను పెంచుకోవడంతో పాటు చైనాపై మరింత దృష్టి పెట్టేందుకు ఈ నియామకం చేపట్టాం. డ్రాగన్ నుంచి మాకు గూఢచర్యం ముప్పు పొంచి ఉంది. దాన్ని పరిష్కరించుకునేందుకే ఈ ప్రయత్నం. చైనా అధికారులను సీఐఏలో చేర్చుకుని డ్రాగన్ రహస్యాలు సేకరించడమే వాటి లక్ష్యం’’ అని రాట్‌క్లిఫ్‌ వెల్లడించారు. జిన్‌పింగ్‌ అవినీతి వ్యతిరేక ఉద్యమం పేరుతో రాజేసిన నిప్పును ఉదహరిస్తూ సినిమాటిక్‌ సన్నివేశాలను ఈ వీడియోల్లో జోడించారు. ‘నా జీవితాన్ని, నా భవిష్యత్తును నా కంట్రోల్‌లో ఉంచుకోవాలంటే సీఐఏలో చేరాలి’ అనే క్యాప్షన్‌తో అమెరికా సంస్థ ఈ వీడియోలను విడుదల చేసింది.
CIA Recruitment
China
United States
Xi Jinping
Espionage
John Ratcliffe
China-US Relations
Intelligence Agency
Viral Videos
Mandarin

More Telugu News