Pakistan airspace: పాక్ గగనతలాన్ని స్వచ్ఛందంగా బహిష్కరిస్తున్న విదేశీ విమాన సంస్థలు

Foreign Airlines too Boycott Pakistan Airspace
  • పాక్ గగనతలాన్ని స్వచ్ఛందంగా వాడని పలు పాశ్చాత్య విమాన సంస్థలు
  • లుఫ్తాన్సా, బ్రిటిష్ ఎయిర్‌వేస్, స్విస్ సహా ప్రధాన యూరోపియన్ క్యారియర్ల కీలక నిర్ణయం
  • భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలే కారణమని వెల్లడి
  • పాకిస్థాన్‌కు ఓవర్‌ఫ్లైట్ రుసుముల్లో నెలవారీగా మిలియన్ డాలర్ల నష్టం
  • విమాన ప్రయాణ సమయం, ఇంధన ఖర్చులు పెరిగే సూచనలు
భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో, అనేక ప్రముఖ పాశ్చాత్య విమానయాన సంస్థలు పాకిస్థాన్ గగనతలాన్ని స్వచ్ఛందంగా బహిష్కరిస్తున్నాయి. పాక్ గగనతలాన్ని ఉపయోగించడాన్ని నిలిపివేశాయి. తమ విమానాలపై ఎలాంటి నిషేధం లేనప్పటికీ, ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

గత రెండు రోజులుగా లుఫ్తాన్సా, బ్రిటిష్ ఎయిర్‌వేస్, స్విస్, ఎయిర్ ఫ్రాన్స్, ఇటలీకి చెందిన ఐటీఏ, పోలెండ్‌కు చెందిన లాట్ వంటి ప్రధాన యూరోపియన్ విమానయాన సంస్థలు పాకిస్థాన్ గగనతలం మీదుగా ప్రయాణించడాన్ని మానుకున్నాయి. దీని కారణంగా యూరప్, భారత్ మధ్య ప్రయాణించే విమానాల సమయం సగటున గంట పాటు పెరిగింది.

ఈ పరిణామం పాకిస్థాన్‌కు ఆర్థికంగా పెద్ద దెబ్బేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తమ గగనతలాన్ని ఉపయోగించుకునే విమానయాన సంస్థల నుంచి పాకిస్థాన్ పౌర విమానయాన అథారిటీ ఓవర్‌ఫ్లైట్ రుసుములను వసూలు చేస్తుంది. ఇప్పుడు అనేక విమానాలు తమ మార్గాలను మార్చుకోవడంతో, పాకిస్థాన్ ప్రతినెలా మిలియన్ల డాలర్ల ఆదాయాన్ని కోల్పోనుంది. గతంలో 2019లో బాలాకోట్ వైమానిక దాడుల తర్వాత పాక్ తన గగనతలాన్ని దాదాపు ఐదు నెలల పాటు మూసివేయడంతో సుమారు 100 మిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసింది.

ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో 26 మంది పర్యాటకుల మృతికి కారణమైన ఉగ్రదాడి ఘటన తర్వాత భారత్, పాకిస్థాన్ పరస్పరం తమ గగనతలాలను మూసివేసుకున్న విషయం తెలిసిందే. భారత విమానాలు పాక్ గగనతలంపై, పాక్ విమానాలు భారత గగనతలంపై ప్రయాణించకుండా నిషేధం విధించుకున్నాయి. ఇప్పుడు పాశ్చాత్య సంస్థలు కూడా పాక్ గగనతలాన్ని వాడకపోవడంతో పాకిస్థాన్‌కు ఆర్థిక నష్టాలు మరింత పెరగనున్నాయి.

అయితే... ప్రయాణ సమయం పెరగడం, ఎక్కువ ఇంధనం వినియోగించాల్సి రావడం వంటి కారణాలతో విమానయాన సంస్థలు పెరిగిన ఖర్చుల భారాన్ని భవిష్యత్తులో ప్రయాణికులపై టికెట్ ధరల పెంపు రూపంలో మోపే అవకాశం లేకపోలేదు.
Pakistan airspace
International airlines
Flight disruptions
India-Pakistan tensions
Lufthansa
British Airways
Air France
Swiss
ITA Airways
LOT Polish Airlines
Overflight charges
Economic impact
Travel time increase

More Telugu News