AV Rangnath: త్వరలో ముఖ్యమంత్రి వస్తున్నారు.. చెరువు అభివృద్ధిలో పురోగతి కనిపించాలి: హైడ్రా కమిషనర్

CMs Visit Spurs Bathukammakunta Lake Development
  • బతుకమ్మ కుంట అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఏవీ రంగనాథ్ ఆదేశాలు
  • కోర్టు ఆటంకాలు తొలగడంతో రూ.7 కోట్లతో ప్రభుత్వం పనులు చేపట్టిందని వెల్లడి
  • వచ్చే బతుకమ్మ పండుగ నాటికి చెరువును సిద్ధం చేయాలని లక్ష్యం
  • పనులకు ఆటంకాలు లేకుండా చూడాలని, స్థానికుల సహకారం తీసుకోవాలని అధికారులకు సూచన
హైదరాబాద్‌లోని బతుకమ్మ కుంట అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాంతాన్ని సందర్శించనున్నారని, ఆయన పర్యటన నాటికి చెరువు అభివృద్ధి పనుల్లో గణనీయమైన పురోగతి కనిపించాలని ఆయన స్పష్టం చేశారు. కమిషనర్ రంగనాథ్ బతుకమ్మ కుంటలో జరుగుతున్న అభివృద్ధి పనులను నేడు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.

న్యాయస్థానం నుంచి అనుమతులు రావడంతో బతుకమ్మ కుంట అభివృద్ధికి ఉన్న ఆటంకాలు తొలగిపోయాయని, దీంతో రాష్ట్ర ప్రభుత్వం రూ. 7 కోట్ల నిధులతో చెరువు పునరుద్ధరణ పనులను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిందని కమిషనర్ తెలిపారు. మోకాలు లోతు మట్టి తీయగానే చెరువు ఆనవాళ్లు కనిపించాయని, ఈ కుంటను పూర్తిస్థాయి చెరువుగా మార్చడమే లక్ష్యమని అన్నారు. వచ్చే బతుకమ్మ పండుగ నాటికి చెరువును పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని, వేడుకలను ఇక్కడే ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు ఎలాంటి ఇబ్బందులు, అవాంతరాలు ఎదురవకుండా హైడ్రా అధికారులు పర్యవేక్షించాలని రంగనాథ్ ఆదేశించారు. చెరువు అభివృద్ధి పనులు ప్రారంభమైనప్పటి నుంచి స్థానిక ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని, వారి సహకారంతో పనులను మరింత వేగంగా పూర్తి చేయాలని కోరారు. వర్షపు నీరు చెరువులోకి సక్రమంగా చేరేలా, అలాగే అదనపు నీరు బయటకు వెళ్లేలా ఇన్‌లెట్, ఔట్‌లెట్లను పటిష్టంగా ఏర్పాటు చేయాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.
AV Rangnath
Hyderabad
Bathukammakunta
Revanth Reddy
Lake Development
Telangana
Commissioner
7 Crore Project
Civic Development

More Telugu News