Pakistan Occupied Kashmir: పీఓకేలో 1000కి పైగా మదర్సాలు మూసివేత

Over 1000 madrasas shut down in PoK amid fears of Indian attack

  • పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో 1000కి పైగా మదర్సాల మూసివేత
  • కనీసం 10 రోజులు సెలవులు ప్రకటించిన స్థానిక అధికార యంత్రాంగం
  • భారత్ దాడులు చేయొచ్చనే భయంతోనే ఈ చర్యలని కథనాలు
  • పహల్గామ్ దాడి తర్వాత పెరిగిన ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు
  • పాక్ వైమానిక సర్వీసుల రద్దు, సరిహద్దుల్లో సైనిక విన్యాసాలు

భారత్ నుంచి దాడులు జరగవచ్చనే ఆందోళనల నేపథ్యంలో పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అక్కడి స్థానిక అధికార యంత్రాంగం శుక్రవారం దాదాపు 1000కి పైగా మదర్సాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. కనీసం 10 రోజుల పాటు ఈ మదర్సాలకు సెలవులు ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ఇటీవల కశ్మీర్‌లోని పహల్గామ్‌లో అమాయక పౌరులపై జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో భారత్ ప్రతీకార దాడులకు దిగవచ్చని, ముఖ్యంగా గతంలో ఉగ్రవాద స్థావరాలుగా ఆరోపణలు ఎదుర్కొన్న మదర్సాలను లక్ష్యంగా చేసుకోవచ్చని పాకిస్థాన్ భయపడుతున్నట్లు సమాచారం. 2019లో బాలాకోట్‌పై భారత వైమానిక దళం జరిపిన దాడుల తరహాలోనే ఇప్పుడు కూడా దాడులు జరగవచ్చని స్థానికులు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి, ప్రభుత్వ ఆదేశాల మేరకే మదర్సాలను మూసివేసినట్లు ధృవీకరించారు.

భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్థాన్ ఇప్పటికే గిల్గిత్, స్కర్డులకు వెళ్లే పలు దేశీయ విమాన సర్వీసులను రద్దు చేసింది. ఉత్తర ప్రాంతాలకు వెళ్లే ఇతర విమానాలను కూడా ముందుజాగ్రత్త చర్యగా తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా భారత్ మీదుగా వచ్చే విదేశీ విమానాలపై కఠిన నిఘా పెట్టినట్లు పాక్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (సీఏఏ) వర్గాలు పేర్కొన్నాయి.

మరోవైపు, మతపరమైన సంస్థల ముసుగులో పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని భారత్ ఆరోపిస్తోంది. పహల్గామ్ దాడి వెనుక పాక్ హస్తం ఉందని కూడా ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలను పాకిస్థాన్ ఖండించింది. సింధు జలాల ఒప్పందాన్ని దృష్టిలో పెట్టుకుని భారత్ ఇలాంటి ఆరోపణలు చేస్తోందని ఎదురుదాడికి దిగింది. తమపై దాడికి ప్రయత్నిస్తే తక్షణమే గట్టిగా బదులిస్తామని పాకిస్థాన్ ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి భారత్‌ను హెచ్చరించారు. నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ సైనిక విన్యాసాలను కూడా ముమ్మరం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

Pakistan Occupied Kashmir
POJK
Madrasas Closure
India-Pakistan Tension
Terrorism
Balakot Air Strike
Gilgit-Baltistan
Pakistani Military
Ahmad Sharif Chaudhry
Pulwama Attack
  • Loading...

More Telugu News