Himanshi Narwal: ముస్లింల గురించి పహల్గామ్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన నేవీ ఆఫీసర్ భార్య కీలక వ్యాఖ్యలు

Indian Navy Officers Wifes Heartwrenching Appeal
  • భర్తను కోల్పోయినా శాంతినే కోరుకుంటున్నానన్న హిమాన్షి
  • ముస్లింలపై ద్వేషం లేదని వ్యాఖ్య
  • శాంతి, న్యాయం కావాలన్న హిమాన్షి
పహల్గామ్ ఉగ్రదాడిలో తన భర్త, నేవీ అధికారి వినయ్ నర్వాల్‌ను కోల్పోయిన హిమాన్షి నర్వాల్ సమాజానికి శాంతి సందేశాన్ని అందించారు. భర్త స్మారకార్థం నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, తనకు ముస్లింలు లేదా కశ్మీరీలపై ఎలాంటి ద్వేషం లేదని... శాంతి, న్యాయం మాత్రమే కోరుకుంటున్నానని ఉద్వేగభరితంగా పేర్కొన్నారు.

వినయ్ నర్వాల్ గౌరవార్థం నేషనల్ ఇంటిగ్రేటెడ్ ఫోరమ్ ఆఫ్ ఆర్టిస్ట్స్ అండ్ యాక్టివిస్ట్స్ నిన్న ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి హిమాన్షి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం దేశ ప్రజల్లో నెలకొన్న ఆగ్రహాన్ని తాను అర్థం చేసుకున్నానని, అయితే ప్రజలు ముస్లింలకు గానీ, కశ్మీరీలకు గానీ వ్యతిరేకంగా మారడాన్ని తాను కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. "మేము శాంతిని మాత్రమే కోరుకుంటున్నాం. కచ్చితంగా మాకు న్యాయం జరగాలి" అని ఆమె అన్నారు. మత ఘర్షణలకు ముగింపు పలకాలని విజ్ఞప్తి చేస్తూ, తన భర్త వినయ్ నర్వాల్ కూడా ఇదే ఆకాంక్షించేవారని ఆమె తెలిపారు.

గురుగ్రామ్‌కు చెందిన హిమాన్షి పీహెచ్‌డీ స్కాలర్. కేవలం కొద్ది వారాల క్రితమే, ఏప్రిల్ 16న ఆమెకు నేవీ అధికారి వినయ్ నర్వాల్‌తో వివాహం జరిగింది. ఏప్రిల్ 19న రిసెప్షన్ అనంతరం, వారు హనీమూన్ కోసం కశ్మీర్‌లోని పహల్గామ్‌కు వెళ్లారు. అయితే, ఏప్రిల్ 22న వారు సేదతీరుతున్న సమయంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో వినయ్ నర్వాల్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. భర్త మృతదేహం వద్ద హిమాన్షి కన్నీరుమున్నీరైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

వినయ్ నర్వాల్ అంత్యక్రియలను హర్యానాలో సైనిక లాంఛనాలతో నిర్వహించారు. పలువురు రాజకీయ ప్రముఖులు హిమాన్షిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. భర్త శవపేటిక వద్ద హిమాన్షి సెల్యూట్ చేసిన దృశ్యాలు పలువురిని కదిలించాయి. ఇంతటి విషాదం నెలకొన్నప్పటికీ, హిమాన్షి ద్వేషానికి బదులు శాంతి, న్యాయం కోసం పిలుపునివ్వడం గమనార్హం. 
Himanshi Narwal
Vinay Narwal
Pahalgham Attack
Kashmir Terrorist Attack
Indian Navy Officer
Peace Appeal
Muslim Community
Kashmiri People
Terrorism in Kashmir
Gurgaon

More Telugu News