Supreme Court: కుమార్తెకు ఇంటి భోజనం పెట్టని తండ్రికి సుప్రీంకోర్టులో షాక్!

- మనస్పర్థలతో విడిపోయిన దంపతులు
- 8 ఏళ్ల కుమార్తె కస్టడీని నెలలో 15 రోజులు తండ్రికి అప్పగించిన కేరళ హైకోర్టు
- ఆ 15 రోజులూ చిన్నారికి హోటల్ నుంచి తెచ్చిన భోజనమే పెడుతున్న తండ్రి
- హోటల్ ఆహారం చిన్నారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందన్న సుప్రీంకోర్టు
- కేరళ హైకోర్టు ఉత్తర్వులు రద్దు చేస్తూ కుమార్తె కస్టడీని తల్లికి అప్పగించిన సర్వోన్నత న్యాయస్థానం
ఎనిమిదేళ్ల కుమార్తె సంరక్షణ విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పాపకు ఇంటి భోజనం అందించలేకపోతున్నాడన్న కారణంతో తండ్రికి కేరళ హైకోర్టు మంజూరు చేసిన సంరక్షణ బాధ్యతలను రద్దు చేసి పూర్తి కస్టడీని తల్లికి అప్పగించింది. ఈ నిర్ణయం తీసుకునే ముందు జస్టిస్‌లు విక్రమ్‌నాథ్, సంజయ్ కరోల్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం బాలికతో స్వయంగా మాట్లాడింది.
దంపతులు విడిపోయిన ఈ కేసులో గతంలో కేరళ హైకోర్టు 8 ఏళ్ల బాలిక కస్టడీని నెలకు 15 రోజుల చొప్పున తండ్రికి అప్పగించింది. సింగపూర్‌లో ఉద్యోగం చేస్తున్న ఆ తండ్రి కుమార్తెతో సమయం గడిపేందుకు ప్రతి రెండు వారాలకు ఒకసారి తిరువనంతపురం వచ్చి అక్కడ అద్దెకు తీసుకున్న ఇంట్లో ఉండేవారు. అయితే, ఆయన తనతో ఉన్న 15 రోజుల వ్యవధిలో ఒక్కరోజు కూడా పాపకు ఇంట్లో వండిన ఆహారం పెట్టలేకపోయారని, పూర్తిగా హోటళ్ల ఆహారాన్నే అందించారని సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది.
బాలిక ఆరోగ్యం, వికాసానికి ఇంటి భోజనమే మేలు
‘హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి తెచ్చిన ఆహారాన్ని నిరంతరం తినడం పెద్దల ఆరోగ్యానికే ముప్పు కలిగిస్తుంది. అలాంటిది ఎనిమిదేళ్ల చిన్నారికి అది ఎంత హానికరం?’ అని జస్టిస్ సందీప్ మెహతా విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు. బాలిక సంపూర్ణ ఆరోగ్యం, ఎదుగుదల, వికాసానికి ఇంట్లో వండిన పౌష్టికాహారం చాలా అవసరమని, కానీ ఆ పోషణను అందించే స్థితిలో తండ్రి లేరని ధర్మాసనం అభిప్రాయపడింది. తండ్రికి కుమార్తెపై ఎనలేని ప్రేమ ఉన్నప్పటికీ, ఆయన ఇంట్లో ఉన్న వాతావరణం, పరిస్థితులు బాలిక శ్రేయస్సుకు, ఎదుగుదలకు అనుకూలంగా లేవని కోర్టు పేర్కొంది. ముఖ్యంగా, కస్టడీ సమయంలో తండ్రి తప్ప పాపకు తోడుగా మరెవరూ లేకపోవడం కూడా ప్రతికూల అంశంగా మారింది. మరోవైపు, తల్లి తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోందని, ఇంటి నుంచే పనిచేస్తోందని, అక్కడ పాపకు అమ్మమ్మ, తాతయ్యలతో పాటు మూడేళ్ల తమ్ముడి తోడు కూడా లభిస్తుందని కోర్టు గమనించింది. ఈ వాతావరణం బాలికకు ఎంతో మేలు చేస్తుందని భావించింది.
కేరళ హైకోర్టు ఉత్తర్వులపై అసంతృప్తి
ఇదే కేసులో మూడేళ్ల కుమారుడి కస్టడీని కూడా నెలకు 15 రోజులు తండ్రికి అప్పగిస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపైనా సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అంత చిన్న వయసులో తల్లి నుంచి వేరు చేయడం బాలుడి మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించింది. తల్లి వద్ద లభించే భావోద్వేగ, నైతిక మద్దతుతో పోలిస్తే తండ్రి ఇచ్చే తాత్కాలిక మద్దతు చాలా తక్కువని స్పష్టం చేసింది. అక్క తండ్రితో ఉన్నప్పుడు తమ్ముడు కూడా ఆమె తోడును కోల్పోతున్నాడని పేర్కొంది.
తుది ఉత్తర్వుల్లో తండ్రి తన కుమార్తెను ప్రతి నెలా ప్రత్యామ్నాయ వారాంతాల్లో కలుసుకునేందుకు, తన తాత్కాలిక సంరక్షణలోకి తీసుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. అలాగే, వారానికి రెండు రోజులు వీడియో కాల్ ద్వారా పాపతో మాట్లాడే అవకాశాన్ని కల్పించింది. పిల్లల సంక్షేమమే అత్యంత ముఖ్యమని ఈ తీర్పు ద్వారా సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది.