ఇట్స్ అఫీషియల్‌.. ఆమెతో ప్రేమ‌లో ఉన్న‌ట్లు చెప్పిన శిఖ‌ర్ ధావ‌న్‌!

  • సోఫీ షైన్ తో తాను రిలేష‌న్‌లో ఉన్న‌ట్లు వెల్ల‌డించిన మాజీ క్రికెట‌ర్‌
  • ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా ఆమెతో క‌లిసి ఉన్న ఫొటోను పంచుకున్న ధావ‌న్‌
  • ఛాంపియ‌న్స్ ట్రోఫీ జ‌రిగిన‌ప్ప‌టి నుంచి జంట‌గా క‌నిపిస్తున్న‌ గ‌బ్బ‌ర్‌, సోఫీయా
భార‌త మాజీ క్రికెట‌ర్ శిఖర్ ధావన్ తాను ప్రేమలో ఉన్నానని అధికారికంగా ధ్రువీకరించాడు. సోఫీ షైన్ తో తాను రిలేష‌న్‌లో ఉన్న‌ట్లు తెలిపాడు. గ‌త కొంత‌కాలంగా ఆమెతో రిలేష‌న్‌పై వ‌స్తున్న వంద‌తుల‌కు చెక్ పెడుతూ త‌న కొత్త గ‌ర్ల్‌ఫ్రెండ్‌ను గురువారం అంద‌రికీ ప‌రిచ‌యం చేశాడు. ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా ఆమెతో క‌లిసి ఉన్న ఫొటోను 'మై ల‌వ్' అంటూ హ‌ర్ట్ ఎమోజీతో పోస్ట్ చేశాడు. 

ఐర్లాండ్‌కు చెందిన సోఫీయా షైన్... మార్కెటింగ్, మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తి చేసింది. ప్ర‌స్తుతం సోఫియా ప్రొడ‌క్ట్ క‌న్స‌ల్టంట్‌గా ప‌ని చేస్తోంది. అబుదాబీలోని నార్త‌ర్న్ ట్ర‌స్ట్ కోఆప‌రేష‌న్ సంస్థ‌లో ఉపాధ్య‌క్షురాలిగా సేవ‌లందిస్తోందీ ముద్దుగుమ్మ‌. ఇటీవ‌ల దుబాయిలో ఛాంపియ‌న్స్ ట్రోఫీ జ‌రిగిన‌ప్ప‌టి నుంచి గ‌బ్బ‌ర్‌, సోఫీయాలు జంట‌గా క‌నిపిస్తున్న విష‌యం తెలిసిందే.

కాగా, ధావ‌న్‌ భార్య అయేషా ముఖ‌ర్జీతో 11 ఏళ్ల వివాహ‌బంధానికి స్వ‌స్తి ప‌లుకుతూ 2023లో విడాకులు తీసుకున్నాడు. అప్ప‌టి నుంచి ఒంట‌రిగానే ఉంటున్నాడు గ‌బ్బ‌ర్‌. ఇప్పుడు సోఫీ షైన్ రాకతో త‌న జీవితంలో మ‌ళ్లీ సంతోషం వ‌చ్చింద‌ని మురిసిపోతున్నాడు. ఇక‌, శిఖ‌ర్ ధావ‌న్ గ‌తేడాది అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. 

ధావన్ టీమిండియాకు 2010 నుంచి 2022 వ‌ర‌కు 167 వన్డేలు, 34 టెస్టులు, 68 టీ20ల‌లో ప్రాతినిధ్యం వ‌హించాడు. 167 వన్డేల్లో 6,793 పరుగులు చేశాడు. 34 టెస్టుల్లో 2,315 పరుగులు, 68 టీ20ల్లో 1,759 ర‌న్స్ చేశాడు. మొత్తంగా త‌న అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 10వేల‌కు పైగా ప‌రుగులు చేశాడు. 


More Telugu News