ప‌ది ఫ‌లితాల్లో ప్ర‌తిభావంతుల‌కు విమాన ప్ర‌యాణం.. మాట నిల‌బెట్టుకున్న ఎంఈఓ

  • ప‌ది ఫ‌లితాల్లో 550 మార్కులు సాధించిన ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ విద్యార్థుల‌కు విమాన ప్ర‌యాణం 
  • ఆ మేర‌కు మాట ఇచ్చిన‌ అనంత‌పురం జిల్లా బెళుగుప్ప మండ‌ల ఎంఈఓ మ‌ల్లారెడ్డి
  • ఇటీవ‌ల ప్ర‌క‌టించిన ప‌ది ఫ‌లితాల్లో మండ‌లంలోని పలువురు విద్యార్థినుల‌కు 550కి పైగా మార్కులు
  • గురువారం విద్యార్థినుల‌ను బెంగ‌ళూరుకు తీసుకెళ్లి అక్క‌డి నుంచి విమానంలో హైదరాబాద్‌కు జ‌ర్నీ
ఇటీవ‌ల విడుద‌లైన ఏపీ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల్లో స‌త్తాచాటిన ప్ర‌తిభావంతుల‌కు ఎంఈఓ ఇచ్చిన మాట ప్ర‌కారం విమాన ప్ర‌యాణం చేయించారు. ఫ‌లితాల్లో 550 మార్కులు సాధించిన ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ విద్యార్థుల‌కు విమాన ప్ర‌యాణం చేయిస్తాన‌ని అనంత‌పురం జిల్లా బెళుగుప్ప మండ‌ల విద్యాధికారి (ఎంఈఓ) మ‌ల్లారెడ్డి మాట ఇచ్చారు. 

ఆ మేర‌కు ఆయ‌న ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్నారు. ఇటీవ‌ల ప్ర‌క‌టించిన ప‌ది ఫ‌లితాల్లో మండ‌లంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌కు చెందిన ఇందు, లావ‌ణ్య‌, ఈశ్వ‌రి, అర్చ‌న‌, మ‌ధుశ్రీ అనే విద్యార్థినిలు 550కి పైగా మార్కులు సాధించారు. దాంతో గురువారం ఎంఈఓ మ‌ల్లారెడ్డి విద్యార్థినులతో క‌లిసి వెళ్లి, క‌లెక్ట‌ర్ వినోద్ కుమార్‌, జిల్లా విద్యాశాఖ అధికారుల వ‌ద్ద అనుమ‌తి తీసుకున్నారు. 

అనంత‌రం బెంగ‌ళూరుకు బ‌య‌ల్దేరి వెళ్లారు. అక్క‌డి నుంచి విమానంలో హైద‌రాబాద్‌కు వెళ‌తారు. అక్క‌డ ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌ను చూపించి తీసుకువ‌స్తాన‌ని, అందుకు అయ్యే వ్య‌యాన్ని తానే భ‌రిస్తాన‌ని ఎంఈఓ తెలిపారు.  


More Telugu News