ఫాలోవర్లు తగ్గుతున్నారని ఆత్మహత్య చేసుకుంది!.. తాప్సీ విచారం

  • పాప్యులర్ కంటెంట్ క్రియేటర్ మిషా అగర్వాల్ (25) ఆత్మహత్య
  • ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు తగ్గడంతో డిప్రెషన్‌కు లోనైనట్టు కుటుంబం వెల్లడి
  • ఏప్రిల్ 24న, పుట్టినరోజుకు రెండు రోజుల ముందు బలవన్మరణం
  • సోషల్ మీడియా ప్రభావంపై నటి తాప్సీ ఆందోళన
సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎంత బలంగా పడుతుందో చాటిచెప్పే విషాద సంఘటన ఇది. ప్రముఖ కంటెంట్ క్రియేటర్, న్యాయ విద్యార్థిని మిషా అగర్వాల్ (25) తన పుట్టినరోజుకు కేవలం రెండు రోజుల ముందు, ఏప్రిల్ 24న ఆత్మహత్య చేసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్లు తగ్గిపోతున్నారనే కారణంతో ఆమె తీవ్ర డిప్రెషన్‌కు లోనై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

మిషా అగర్వాల్ సోషల్ మీడియాలో మంచి గుర్తింపు పొందారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 10 లక్షల మంది ఫాలోవర్లను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారని, అయితే ఇటీవల కాలంలో ఫాలోవర్ల సంఖ్య తగ్గడం ప్రారంభమైందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ పరిణామం ఆమెను తీవ్రంగా కలచివేసిందని, తనకంటూ విలువ లేదని భావించి తీవ్ర మానసిక వేదనకు గురైందని వారు పేర్కొన్నారు.

"ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు తగ్గిపోతున్నారు, తన కెరీర్ ముగిసిపోయినట్లేనని భయపడుతూ మమ్మల్ని హత్తుకుని ఏడ్చేది. సోషల్ మీడియానే జీవితం కాదని, దాని గురించి అంతగా ఆందోళన చెందవద్దని మేము నచ్చజెప్పే ప్రయత్నం చేశాం" అని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మిషా న్యాయశాస్త్రంలో (ఎల్ఎల్ బీ) పట్టా పొందిందని, పీసీఎస్‌జే (జ్యుడీషియల్ సర్వీసెస్) పరీక్షలకు సిద్ధమవుతోందని, త్వరలోనే మంచి భవిష్యత్తు ఉంటుందని తాము ధైర్యం చెప్పినప్పటికీ ఆమె తన ఆలోచనల నుంచి బయటకు రాలేకపోయిందని వాపోయారు. ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల కోసం ఆమె ఇంత తీవ్ర నిర్ణయం తీసుకుంటుందని ఊహించలేకపోయామని కన్నీటిపర్యంతమయ్యారు.

తాప్సీ స్పందన

ఈ విషాద ఘటనపై ప్రముఖ సినీ నటి తాప్సీ స్పందించారు. సోషల్ మీడియాలో లైకులు, ఫాలోవర్ల సంఖ్య ఆధారంగా వ్యక్తుల విలువను అంచనా వేసే ధోరణి పెరిగిపోవడంపై ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. "ఇలాంటి రోజు వస్తుందని ఎప్పటినుంచో భయపడుతున్నాను. నిజమైన జీవితాన్ని, ప్రేమను కాకుండా.. వర్చువల్ ప్రపంచంలోని లైకులు, ఫాలోవర్ల సంఖ్యనే ప్రేమగా భావిస్తున్నారు. ఈ వర్చువల్ ప్రేమ.. అసలైన బంధాలను మరుగున పడేస్తోంది. చదువుకున్న డిగ్రీల కన్నా లైకులకే ఎక్కువ విలువ ఇవ్వడం బాధాకరం. ఈ ఘటన మనసును కలిచివేసింది" అని తాప్సీ తన సామాజిక మాధ్యమ ఖాతాలో ఆవేదన వ్యక్తం చేశారు.


More Telugu News