గుండెలను పిండేసే ఘటన.. 10 రోజుల క్రితం మరణించిన బాలిక.. పదో తరగతిలో స్కూల్ టాపర్
- నిన్న వెలువడిన తెలంగాణ టెన్త్ ఫలితాలు
- ఈ ఫలితాల్లో స్కూల్ టాపర్‌గా నిలిచిన రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన బాలిక
- ఫలితాలకు ముందే విషాదం
- పరీక్షలు పూర్తయిన 13 రోజులకే తిరిగిరాని లోకాలకు విద్యార్థిని
- గుండెలవిసేలా రోదిస్తున్న బాలిక తల్లిదండ్రులు
అసలేం జరిగిందంటే..
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన ఆకుల రవి, రజిత దంపతుల కూతురు ఆకుల నాగచైతన్య అదే గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివింది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగిన పరీక్షలకు ఉత్సాహంగా హాజరైంది. అలా పరీక్షలు పూర్తయిన 13 రోజులకు ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది.
చివరికి ఆరోగ్యం క్షీణించి పరిస్థితి విషమించడంతో ఏప్రిల్ 17న చనిపోయింది. అయితే, బుధవారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఆమె 600 మార్కులకు గాను 510 మార్కులు సాధించి స్కూల్ ఫస్ట్‌గా నిలిచింది. కానీ, ఆ సంతోషాన్ని పంచుకునేందుకు కూతురే లేకపోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.