రూ. 10 వేల కోసం నీరు కలపకుండా 5 బాటిళ్ల మద్యం తాగి యువకుడి మృతి

  • కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ఘటన
  • రా లిక్కర్ తాగిన వెంటనే అస్వస్థతకు గురైన యువకుడు
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • ఆరుగురిపై కేసు.. ఇద్దరి అరెస్ట్
కర్ణాటకలోని కోలార్ జిల్లా ములబాగిల్‌లో విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో రూ.10 వేల పందెం కాసిన ఓ యువకుడు 5 సీసాల మద్యాన్ని నీరు కలపకుండా తాగి అస్వస్థతకు గురై మరణించాడు. పోలీసుల కథనం ప్రకారం.. తాను ఐదు సీసాల మద్యాన్ని నీరు కలపకుండా తాగగలనని కార్తీక్ (21) అనే యువకుడు స్నేహితులు వెంకటరెడ్డి, సుబ్రమణితో చెప్పాడు. స్పందించిన వెంకటరెడ్డి అలా తాగితే రూ. 10 వేలు ఇస్తానని పందెం కాశాడు. 

పందెం కుదరడంతో కార్తీక్ ఐదు బాటిళ్ల మద్యాన్ని నీరు కలపకుండా గడగడా తాగేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతడిని ములబాగిల్‌లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కార్తీక్ ప్రాణాలు కోల్పోయాడు. కార్తీక్‌కు ఏడాది క్రితమే వివాహమైంది. అతడి భార్య వారం రోజుల క్రితమే బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంకటరెడ్డి, సుబ్రమణి సహా ఆరుగురిపై కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. 


More Telugu News