Narendra Modi: పుల్వామా దాడి తర్వాత తొలిసారి మోదీ ‘సూపర్ కేబినెట్’ భేటీ.. ఏం జరగబోతోంది?

Modis Super Cabinet Meeting After Pahalgham Attack
  • 2019 ఫిబ్రవరిలో సూపర్ కేబినెట్ భేటీ
  • ఈ సమావేశం తర్వాతే పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రైక్స్
  • తాజాగా సమావేశం నేపథ్యంలో సర్వత్ర ఉత్కంఠ
కేబినెట్ కమిటీల్లో అత్యంత శక్తిమంతమైన, ‘సూపర్ కేబినెట్’గా పిలిచే ‘రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ’ (సీసీపీఏ) నేడు సమావేశం కానుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన నేపథ్యంలో ప్రధాని నిన్న తన నివాసంలో అత్యున్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో నేడు ‘సూపర్ కేబినెట్’ భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. 

రాజకీయ, ఆర్థిక, జాతీయ ప్రాముఖ్యం కలిగిన అంశాలపై సమీక్ష నిర్వహించడం, నిర్ణయాలు తీసుకోవడంలో సీసీపీఏ కీలక పాత్ర పోషిస్తోంది. గతంలో పుల్వామా దాడి తర్వాత ఫిబ్రవరి 2019లో సూపర్ కేబినెట్ భేటీ అయింది. ఆ సందర్భంగా భద్రతా పరమైన అంశాలపై సమీక్షతోపాటు ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే వ్యూహాలపై చర్చించారు. ఆ తర్వాత ఫిబ్రవరి 26, 2019న భారత వైమానిక దళం పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో దాడులు నిర్వహించింది. ఈ నేపథ్యంలో తాజా భేటీలో తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

సీసీపీఏకు ప్రధాని మోదీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇందులో సభ్యులుగా ఉన్నారు. అలాగే, నేడు జరగనున్న ‘కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ’ సమావేశానికి కూడా మోదీ అధ్యక్షత వహించనున్నారు. పహల్గామ్ దాడి తర్వాత ఇది రెండో సీసీఎస్ సమావేశం కావడం గమనార్హం.
Narendra Modi
Super Cabinet
Cabinet Committee on Political Affairs
CCPA
Pulwama Attack
Pahalgham Attack
National Security
India
Rajnath Singh
Amit Shah

More Telugu News