Preity Zinta: బీజేపీలో చేరుతున్నారా అన్న అభిమానిపై మండిపడి, ఆపై సారీ చెప్పిన ప్రీతి

Preity Zinta Apologizes After Angry Response to BJP Question
  • సోషల్ మీడియాలో ఆస్క్ మీ ఎనీ థింగ్ నిర్వహించిన ప్రీతి జింటా
  • బీజేపీలో చేరుతున్నారా అని అడిగిన అభిమాని
  • ఆగ్రహం వ్యక్తం చేసిన నటి
  • తాజాగా తన ఆగ్రహంపై వివరణ 
ప్రముఖ బాలీవుడ్ నటి ప్రీతి జింటా, సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' (గతంలో ట్విట్టర్)లో ఒక అభిమానికి క్షమాపణలు తెలిపారు. ఇటీవల ఆమె నిర్వహించిన 'ఆస్క్ మీ ఎనీథింగ్' సెషన్‌లో భాగంగా, బీజేపీలో చేరుతున్నారా? అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు ప్రీతి కాస్త ఆగ్రహంతో బదులిచ్చారు. అయితే, ఆ తర్వాత రోజు తన కోపంపై వివరణ ఇస్తూ, అభిమానికి క్షమాపణ చెప్పారు.

సోమవారం జరిగిన 'ఆస్క్ మీ ఎనీథింగ్' కార్యక్రమంలో ఒక అభిమాని, ప్రీతి రాజకీయ ప్రవేశంపై, ప్రత్యేకంగా బీజేపీలో చేరిక గురించి ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ప్రీతి, తన వ్యక్తిగత విశ్వాసాలకు, రాజకీయాలకు ముడిపెట్టడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. తాను గుడికి వెళ్లినంత మాత్రాన, లేదా కుంభమేళాకు హాజరైనంత మాత్రాన, తన భారతీయ గుర్తింపు పట్ల గర్వంగా ఉన్నంత మాత్రాన రాజకీయాల్లోకి వస్తున్నట్లు, అందులోనూ బీజేపీలో చేరుతున్నట్లు భావించడం సరికాదని బదులిచ్చారు. విదేశాల్లో నివసిస్తున్న తనకు మాతృభూమి విలువ ఇప్పుడు మరింత బాగా తెలుస్తోందని అన్నారు. అయితే, ఆమె సమాధానం కాస్త ఆగ్రహంతో కూడి ఉందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు.

ఈ నేపథ్యంలో, ప్రీతి జింటా మంగళవారం మరో ట్వీట్ ద్వారా స్పందించారు. "నా సమాధానం కాస్త దురుసుగా అనిపించి ఉంటే క్షమించండి! ఆ ప్రశ్న వల్ల నాకు పీటీఎస్‌డీ (పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్) ఉంది. మీ స్పష్టతను అభినందిస్తున్నాను" అని ఆమె పేర్కొన్నారు. ఇంకా వివరిస్తూ, "తల్లయ్యాక, విదేశంలో ఉంటున్న నేను.. నా పిల్లలు తమ మూలాలను (సగం భారతీయులమన్న విషయాన్ని) మర్చిపోకూడదని కోరుకుంటున్నాను. నా భర్త ఆజ్ఞేయవాది (agnostic-దేవుడు ఉన్నాడని ఒప్పుకోరు, లేడనీ ఒప్పుకోరు). 

మేమిద్దరం మా పిల్లలను హిందువులుగా పెంచుతున్నాం. కానీ, విచారకరంగా ఈ విషయంలో నేను నిరంతర విమర్శలు ఎదుర్కొంటున్నాను. నా అభిప్రాయాలను రాజకీయం చేయడం ద్వారా, నా ఈ చిన్న సంతోషాన్ని కూడా దూరం చేస్తున్నారు. నా మూలాలు, మతం గురించి పిల్లలకు నేర్పడంలో గర్వపడుతున్నందుకు కూడా నేను సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వస్తోందనిపిస్తోంది. సరే, ఇక ముందుకు సాగుదాం.. మీకు నా ప్రేమ, శుభాకాంక్షలు" అని ప్రీతి తన ట్వీట్‌లో వివరించారు.

ప్రీతి జింటా 2016లో జీన్ గుడ్‌ఎనఫ్‌ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు సరోగసీ ద్వారా 2021 నవంబర్ 11న జై, జియా అనే కవలలు జన్మించారు.

సినిమాల విషయానికొస్తే, ప్రీతి జింటా దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించనున్నారు. రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'లాహోర్ 1947' చిత్రంలో ఆమె నటిస్తున్నారు. ఈ సినిమాలో సన్నీ డియోల్, షబానా అజ్మీ, అలీ ఫజల్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్ నిర్మిస్తుండటం విశేషం.
Preity Zinta
Bollywood Actress
BJP
Ask Me Anything
Social Media
Twitter
Apology
India
Political Entry
Lahore 1947

More Telugu News