Ganesh Sharma: కంచి కామకోటి పీఠాధిపతిగా అభిషిక్తులవుతున్న గణేశ్ శర్మ.. రేవంత్ రెడ్డి స్పందన

Ganesh Sharma Appointed as New Kanchi Kamakshi Peethadhipati
  • కంచి కామకోటి పీఠం 71వ ఉత్తరాధికారిగా దుడ్డు గణేశ శర్మ ఎంపిక
  • రేపు అక్షయ తృతీయ గణేశ శర్మ సన్యాస దీక్ష స్వీకరణ
  • గణేశ శర్మకు సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు అభినందనలు
  • తెలంగాణకు, బాసర సరస్వతికి గణేశ శర్మ సేవలను కొనియాడిన నేతలు
కంచి కామకోటి పీఠానికి నూతన ఉత్తరాధికారిగా ఋగ్వేద పండితులు దుడ్డు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశ శర్మ ఇదివరకే ఎంపికయ్యారు. 71వ ఆచార్యులుగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి వారు గణేశ్ శర్మను ఎంపిక చేశారు.

ఈ నెల 30వ తేదీన అక్షయ తృతీయ శుభ సందర్భంగా గణేశ శర్మకు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి వారు సన్యాస దీక్షను ఇవ్వనున్నారు. ఈ కీలక పరిణామం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు సహా పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ గణేశ శర్మకు శుభాకాంక్షలు తెలియజేశారు.

మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, సీఎం రేవంత్ రెడ్డి గణేశ శర్మ సేవలను కొనియాడారు. ఋగ్వేద పండితులుగా బాసర జ్ఞాన సరస్వతి దేవికి, తెలంగాణ ప్రాంతానికి గణేశ శర్మ ఎనలేని ధార్మిక సేవలు అందించారని పేర్కొన్నారు. ఋగ్వేదంతో పాటు యజుర్వేదం, సామవేదం, షడంగాలు, దశోపనిషత్తులలోనూ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి అనుగ్రహంతో అపార జ్ఞానాన్ని సంపాదించారని సీఎం గుర్తుచేశారు.

సనాతన ధర్మ గురుపరంపరకు, భక్తి తత్వానికి, జ్ఞాన మార్గానికి ఈ నియామకం మరింత బలం చేకూరుస్తుందని, ఈ వేడుక తెలంగాణ ప్రజలకు చిరస్మరణీయంగా నిలుస్తుందని ఆయన అన్నారు. అక్షయ తృతీయ నాడు జరిగే ఈ కార్యక్రమం సందర్భంగా తెలంగాణ ప్రజల తరఫున కంచి కామకోటి పీఠానికి ముఖ్యమంత్రి ప్రణామాలు తెలియజేశారు. ఈ గురుపరంపర మానవాళికి ధర్మాన్ని, జ్ఞానాన్ని, శాంతిని నిరంతరం అందించాలని ఆకాంక్షించారు.

మాజీ మంత్రి హరీశ్ రావు కూడా ఒక సందేశం ద్వారా గణేశ శర్మకు శుభాకాంక్షలు తెలిపారు. "వేదవిదులు, ఉపనిషత్ జ్ఞాన నిధులు దుడ్డు సూర్య సుబ్రహ్మణ్య శర్మ స్వామి వారు కంచి కామకోటి పీఠ ఆచార్యులుగా అభిషిక్తులవుతున్న శుభవేళ సాదర ప్రణామాలు" అని పేర్కొన్నారు. పరమాచార్య చంద్రశేఖర సరస్వతి, జయేంద్ర సరస్వతుల పరంపరలో 71వ ఆచార్యులుగా బాధ్యతలు స్వీకరిస్తున్న గణేశ శర్మ మార్గదర్శకత్వంలో సనాతన ధర్మం మరింతగా విలసిల్లాలని హరీశ్ రావు ఆకాంక్షించారు.
Ganesh Sharma
Kanchi Kamakshi Peetham
71st Acharya
Revanth Reddy
Harish Rao
Akshaya Tritiya
Hindu Religion
Spiritual Leader
Telangana
Sanyas Diksha

More Telugu News