Konda Surekha: పనికిమాలిన దేశాలు చేసే చర్యలకు సమాధానం చెప్పాలి: పహల్గామ్ ఉగ్రదాడిపై కొండా సురేఖ

Konda Surekha Condemns Pahalgham Attack
  • పహల్గామ్ ఉగ్రదాడిపై మంత్రి కొండా సురేఖ తీవ్ర స్పందన
  • సంగారెడ్డి జిల్లా కార్యక్రమంలో ఘటనను ఖండించిన మంత్రి
  • ప్రతి భారతీయుడు దేశ రక్షణకు సిద్ధంగా ఉండాలని పిలుపు
  • దేశం పిలిస్తే ప్రాణాలు అర్పించేందుకు సిద్ధమన్న ఓ మాజీ సైనికుడి వ్యాఖ్యలను గుర్తు చేసిన మంత్రి
జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి ఘటనపై తెలంగాణ రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు. సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, ఈ దాడి దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల హేయమైన చర్యలకు తగిన సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు.

దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు మంత్రి సురేఖ తెలిపారు. "పనికిమాలిన దేశాలు చేసే హేయమైన చర్యలకు సమాధానం చెప్పాల్సిన సమయం ఇది" అని ఆమె వ్యాఖ్యానించారు. దేశ రక్షణ కోసం ప్రతి ఒక్క భారతీయుడు నడుం బిగించి, ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపునిచ్చారు. దేశ భద్రత కోసం ప్రతి పౌరుడూ ఒక సైనికుడిలా నిలబడాలని సూచించారు.

ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ ఒక మాజీ సైనికుడి మాటలను గుర్తుచేశారు. "దేశం పిలిస్తే మేము రెక్కలు కట్టుకొని వచ్చి ప్రాణాలు అర్పించేందుకు సిద్ధం" అని ఒక మాజీ సైనికుడు చెప్పారని ఆమె వెల్లడించారు. ఇలాంటి యోధులకు దేశ ప్రజలందరూ అండగా నిలవాలని, ఉగ్రవాదంపై పోరాటంలో భాగస్వాములు కావాలని ఆమె కోరారు.
Konda Surekha
Pahalgham Terrorist Attack
Jammu and Kashmir
Terrorism in India
India Pakistan Relations
Anti-Terrorism
Indian Army
Telangana Minister
National Security

More Telugu News