Jagan Mohan Reddy: పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ ధోనీలా తయారుకావాలి: జగన్

Jagan Wants YSRCP Leaders to be Like Dhoni
  • వైసీపీ జిల్లా అధ్యక్షులతో పార్టీ అధినేత వైఎస్ జగన్ సమావేశం
  • పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై ప్రధాన చర్చ
  • ప్రతిపక్షంలో చురుకైన పాత్ర పోషించాలని నేతలకు పిలుపు
వైసీపీ అధినేత జగన్ పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఈరోజు పార్టీ జిల్లా అధ్యక్షులతో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రతిపక్షంగా సమర్థవంతంగా పని చేయాల్సిన తీరుపై ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నాయకుల్లో ఉండే నిజమైన నాయకత్వ ప్రతిభ బయటపడుతుందని అన్నారు. "భారీ లక్ష్యం ఉన్నప్పుడే బ్యాట్స్‌మన్‌ ప్రతిభ ఏంటో తెలుస్తుంది. అప్పుడే అతడు ప్రజలకు ఇష్టమైన ఆటగాడు అవుతాడు. రాజకీయాల్లో కూడా ఇది అంతే. ప్రతిపక్షంలో మనం చేసే పనుల ద్వారానే మనల్ని మనం నిరూపించుకుంటాం. ప్రజల్లో, పార్టీలో గౌరవం, ఇమేజ్ పెరుగుతాయి. మన పనితీరుతోనే మన్ననలు పొందగలుగుతాం. అందరూ ధోనీలా తయారు కావాలి" అని చెప్పారు.

జిల్లాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై తక్షణం స్పందించి, బాధితులకు అండగా నిలవాలని జిల్లా అధ్యక్షులకు జగన్ పిలుపునిచ్చారు. ప్రజా వ్యతిరేక అంశాలపై గట్టిగా పోరాడాలని, పార్టీ కార్యక్రమాలను చురుగ్గా నిర్వహించాలని స్పష్టం చేశారు. "మనం రాజకీయ నాయకులం. మన జీవితాలను రాజకీయాలకే అంకితం చేశామన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయకూడదు. ప్రతిపక్షంగా మనకు లభించిన అవకాశాలను వృథా చేసుకోకూడదు" అని సూచించారు.

జిల్లా స్థాయిలో ప్రజా సంబంధిత అంశాలను సమర్థవంతంగా వెలుగులోకి తీసుకొస్తేనే ప్రజలకు మరింత చేరువ కాగలమని జగన్ అన్నారు. తిరిగి అధికారంలోకి వస్తేనే ప్రజలకు మరింత మంచి చేయగలమని, ఆ తపనతోనే రాజకీయాలు చేస్తున్నామని తెలిపారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం ప్రతి ఇంట్లో తన ఫోటో ఉండాలనుకున్నానని, అదే స్ఫూర్తితో జిల్లా అధ్యక్షులు కూడా తమ సేవలతో ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. పార్టీ నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కూడా ఈ సందర్భంగా ఆయన జిల్లా అధ్యక్షులకు సూచించారు. 
Jagan Mohan Reddy
YSRCP
Andhra Pradesh Politics
Party Restructuring
Opposition Strategy
Dhoni
Leadership
Political Resurgence
YS Rajasekhar Reddy

More Telugu News