బాల‌య్య‌, అజిత్ కుమార్‌ల‌కు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ శుభాకాంక్ష‌లు

  • నిన్న‌ ప‌ద్మభూష‌ణ్‌ పుర‌స్కారం అందుకున్న బాల‌కృష్ణ‌, అజిత్ కుమార్
  • సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్లువెత్తుతున్న శుభాకాంక్ష‌లు 
  • తాజాగా వారికి శుభాకాంక్ష‌లు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం
నంద‌మూరి బాల‌కృష్ణ‌, త‌మిళ హీరో అజిత్ కుమార్ సోమ‌వారం ప‌ద్మభూష‌ణ్‌ పుర‌స్కారం అందుకున్న విష‌యం తెలిసిందే. నిన్న రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దీ ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. దీంతో సోష‌ల్ మీడియాలో శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ వారికి శుభాకాంక్ష‌లు తెలిపారు. 

"హిందూపురం ఎమ్మెల్యే, ప్ర‌ముఖ న‌టుడు బాల‌కృష్ణ ప‌ద్మభూష‌ణ్‌ పుర‌స్కారం అందుకున్న సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాను. పౌరాణిక‌, జాన‌ప‌ద‌, చారిత్రక పాత్ర‌ల్లో ఆయ‌న శైలి ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకుంటోంది. తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఆయ‌న‌కు ప్ర‌త్యేక స్థానం ఉంది. క‌ళాసేవ‌తో పాటు ప్ర‌జా సేవ‌లోనూ ఆయ‌న మ‌రిన్ని మైలురాళ్లు చేరుకోవాల‌ని ఆకాంక్షిస్తున్నాను" అని ప‌వ‌న్ రాసుకొచ్చారు.  

అలాగే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌ను ఉద్దేశిస్తూ ప్రేమ‌క‌థ, కుటుంబ నేపథ్య సినిమాల‌తో మెప్పిస్తూనే వైవిధ్య‌భ‌రిత‌మైన చిత్రాలు చేస్తూ అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నార‌ని అన్నారు. స్టైల్ ప‌రంగాను త‌న‌కంటూ ప్ర‌త్యేక ముద్ర వేసుకున్నార‌ని తెలిపారు. రేస‌ర్‌గానూ రాణిస్తున్నార‌ని ప్ర‌శంసించారు. ఆయ‌న మ‌రిన్ని విజ‌యాలు అందుకోవాల‌ని జ‌న‌సేనాని ఆకాంక్షించారు.



More Telugu News