KCR: సోనియా గాంధీ కాళ్లు కేసీఆర్ మొక్కారు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

KCR Accused of Bowing Before Sonia Gandhi Komatireddys Strong Remarks
  • సోనియా గాంధీ చొరవతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందన్న మంత్రి
  • కేసీఆర్ పదేళ్ల పాలనలో రూ.10 లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణ
  • అవినీతికి పాల్పడిన కొందరు జైలులో, మరికొందరు అమెరికాలో ఉన్నారని వ్యాఖ్య
  • నల్గొండ నేతలు సంకల్పిస్తే ఎల్కతుర్తి సభ కంటే పెద్ద సభ నిర్వహిస్తామని ధీమా
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకొని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ కాళ్లు మొక్కిన వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. తెలంగాణ ఏర్పాటు క్రెడిట్ పూర్తిగా సోనియా గాంధీదేనని, కేసీఆర్ పాలన అవినీతిమయంగా సాగిందని ఆయన ఆరోపించారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో సోనియా గాంధీ కీలక పాత్ర పోషించారని ఆయన స్పష్టం చేశారు. "సోనియా గాంధీ ఇవ్వకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు" అని కుండబద్దలు కొట్టారు. తెలంగాణ ఇచ్చింది సోనియా అని కేసీఆర్ కూడా స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. తెలంగాణ పాలిట కేసీఆర్ ఒక విలన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై కూడా మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ తన పాలనా కాలంలో సుమారు రూ.10 లక్షల కోట్లు అక్రమంగా సంపాదించారని ఆరోపించారు. "కేసీఆర్‌ పాలనలో అవినీతికి పాల్పడిన కొందరు ఇప్పుడు జైలులో ఉన్నారు. మరికొందరు అమెరికాలో తలదాచుకున్నారు" అని మంత్రి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

రాజకీయంగా బీఆర్ఎస్‌ను ఎదుర్కోవడానికి తాము సంసిద్ధంగా ఉన్నామని కోమటిరెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా నేతలు తలచుకుంటే ఇటీవల ఎల్కతుర్తిలో జరిగిన సభ కంటే పెద్ద బహిరంగ సభను నిర్వహించి తమ సత్తా ఏమిటో చూపించగలమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా నెరవేరుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.
KCR
Komatireddy Venkat Reddy
Sonia Gandhi
Telangana
BRS
Congress
Telangana Formation
Corruption allegations
Political criticism
India Politics

More Telugu News