Dr. Vinod Kumar Paul: ఉప్పు వాడకం తగ్గించడం ఆరోగ్యానికి అత్యంత చౌకైన మార్గం: నిపుణులు

Low sodium in older adults a major health concern say experts
  • భారత్‌లో సగటు ఉప్పు వాడకం రోజుకు 11 గ్రాములు
  • ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసింది 5 గ్రాములు
  • అధిక ఉప్పు వాడకం అసంక్రమిత వ్యాధులకు ప్రధాన కారణం
  • ఉప్పు తగ్గించడం అత్యంత తక్కువ ఖర్చుతో కూడిన ఆరోగ్య వ్యూహం
భారతదేశంలో ప్రజల ఉప్పు వినియోగం ప్రమాదకర స్థాయిలను మించిపోయిందని, ఇది అసంక్రమిత వ్యాధుల భారం పెరగడానికి గణనీయంగా దోహదం చేస్తోందని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆహారంలో ఉప్పు వాడకాన్ని తగ్గించుకోవడం ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు అందుబాటులో ఉన్న అత్యంత చౌకైన, ప్రభావవంతమైన మార్గమని వారు స్పష్టం చేశారు. ఢిల్లీ మెడికల్ అసోసియేషన్ తదితర సంస్థలు సంయుక్తంగా ఢిల్లీలో నిర్వహించిన ‘ది సాల్ట్ ఫైట్ 2025: సే నో టు Na’ అనే వర్క్‌షాప్‌లో ఈ కీలక అంశాలు చర్చకు వచ్చాయి.

ప్రస్తుతం భారతదేశంలో సంభవిస్తున్న మరణాలలో దాదాపు 65 శాతం రక్తపోటు, మధుమేహం, గుండెపోటు, స్ట్రోక్స్, కిడ్నీ వ్యాధుల వంటి అసంక్రమిత వ్యాధుల వల్లేనని, ఈ పరిస్థితిని మార్చాలంటే అధిక ఉప్పు వినియోగం వంటి ప్రమాద కారకాలను నియంత్రించడం అత్యవసరమని నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వినోద్ కుమార్ పాల్ అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ రోజుకు కేవలం 5 గ్రాముల ఉప్పు మాత్రమే సిఫార్సు చేస్తుండగా, భారతీయుల సగటు వినియోగం దాదాపు 11 గ్రాములుగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. తెలియకుండానే ప్రాసెస్ చేసిన ఆహారాలు, రెస్టారెంట్ భోజనాలు, ప్యాకేజ్డ్ స్నాక్స్ ద్వారా అధిక ఉప్పు శరీరంలోకి చేరుతోందని నిపుణులు తెలిపారు. ఉప్పు వినియోగాన్ని 30 శాతం తగ్గించడం ద్వారా రక్తపోటును కనీసం 25 శాతం తగ్గించవచ్చని, తద్వారా గుండెపోటు, స్ట్రోక్స్, కిడ్నీ వ్యాధుల వంటి ఎన్నో సమస్యలను నివారించవచ్చని డాక్టర్ పాల్ గ్లోబల్ పరిశోధనలను ఉటంకిస్తూ వివరించారు.

వైద్యులు తమ రోజువారీ వైద్య సలహాలలో ఉప్పు తగ్గింపు ప్రాముఖ్యతను రోగులకు తప్పనిసరిగా వివరించాలని ఢిల్లీ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ గిరీష్ త్యాగి నొక్కి చెప్పారు. ప్రాసెస్ చేసిన ఆహారాలు, నూనెలు, అధిక ఉప్పు నెమ్మదిగా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డాక్టర్ అతుల్ గోయల్ అన్నారు. రోజుకు కేవలం 2 గ్రాముల ఉప్పు తగ్గించినా లక్షలాది మందిని అనారోగ్యాల బారి నుంచి కాపాడవచ్చని సూచించారు.

ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తులలో ఉప్పును తగ్గించేలా ఆహార పరిశ్రమ చర్యలు తీసుకోవాలని, ప్యాకెట్లపై ఉప్పు సమాచారాన్ని తప్పనిసరిగా స్పష్టంగా ముద్రించాలని (ఫ్రంట్-ఆఫ్-ప్యాక్ లేబులింగ్), అధిక ఉప్పు ఉన్న ఆహారాలపై పన్ను విధించాలని, రుచిలో రాజీ పడకుండా తక్కువ ఉప్పుతో వంటకాలను ప్రోత్సహించాలని నిపుణులు సూచించారు. నివారించగల వ్యాధుల భారాన్ని తగ్గించడానికి వైద్యులు, విధానకర్తలు, ఆహార పరిశ్రమ కలిసికట్టుగా పనిచేసి, దేశవ్యాప్తంగా తక్కువ ఉప్పు వినియోగ సంస్కృతిని ప్రోత్సహించాలని వారు పిలుపునిచ్చారు.
Dr. Vinod Kumar Paul
Dr. Girish Tyagi
Dr. Atul Goel
Salt Intake Reduction
Non-Communicable Diseases
High Blood Pressure
Heart Disease
Stroke
Kidney Disease
India Salt Consumption
WHO Salt Recommendation
Processed Foods
Packaged Snacks
Salt Ta

More Telugu News