ఐదేళ్లలో అత్యుత్తమ సర్జన్లను కూడా రోబోలు అధిగమిస్తాయి: ఎలాన్ మస్క్

  • రాబోయే 5 ఏళ్లలో రోబోలు అత్యుత్తమ మానవ సర్జన్లను అధిగమిస్తాయంటున్న ఎలాన్ మస్క్
  • న్యూరాలింక్ ఇంప్లాంట్ల కోసం రోబోల వినియోగం తప్పనిసరి: మస్క్ వెల్లడి
  • మెడ్‌ట్రానిక్ హ్యూగో రోబో సిస్టమ్ 137 సర్జరీలలో 98% పైగా సక్సెస్
  • మానవులు సాధించలేని వేగం, కచ్చితత్వం రోబోల సొంతం: మస్క్
  • 10 ఏళ్లలో లక్షల మందికి న్యూరాలింక్ ఇంప్లాంట్లు: మస్క్ అంచనా
వైద్య రంగంలో రోబోటిక్స్ వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో, టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత, ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఐదేళ్ల కాలంలో అత్యుత్తమ మానవ సర్జన్లను సైతం రోబోలు అధిగమించగలవని ఆయన జోస్యం చెప్పారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' వేదికగా ఆయన ఈ అభిప్రాయాన్ని పంచుకున్నారు.

కొన్ని సంవత్సరాలలోనే మంచి సర్జన్లను, ఐదేళ్లలో అత్యుత్తమ సర్జన్లను రోబోలు వెనక్కి నెడతాయని మస్క్ పేర్కొన్నారు. తన బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ఫేస్ సంస్థ 'న్యూరాలింక్' కార్యకలాపాలే ఇందుకు నిదర్శనమని ఆయన తెలిపారు. మెదడులో ఎలక్ట్రోడ్లను అమర్చే ప్రక్రియ అత్యంత కచ్చితత్వంతో, వేగంగా జరగాలని, అది మానవమాత్రులకు అసాధ్యమని, అందుకే తాము రోబోల సహాయం తీసుకోవాల్సి వచ్చిందని మస్క్ వివరించారు.

అమెరికాకు చెందిన మెడికల్ డివైస్ కంపెనీ 'మెడ్‌ట్రానిక్' సాధించిన రోబోటిక్ సర్జరీ విజయాలపై ఇన్‌ఫ్లుయెన్సర్ మారియో నవ్‌ఫాల్ చేసిన పోస్ట్‌కు ప్రతిస్పందనగా మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. మెడ్‌ట్రానిక్ కంపెనీకి చెందిన 'హ్యూగో' రోబోటిక్ వ్యవస్థను ఉపయోగించి ఇటీవల 137 వాస్తవ సర్జరీలు (ప్రోస్టేట్, కిడ్నీ, బ్లాడర్ సంబంధిత) విజయవంతంగా పూర్తి చేసినట్లు నవ్‌ఫాల్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఈ సర్జరీల ఫలితాలు వైద్యులు ఊహించిన దానికంటే మెరుగ్గా ఉన్నాయని, 98 శాతానికి పైగా సక్సెస్ రేటు నమోదైందని నవ్‌ఫాల్ తెలిపారు. ప్రోస్టేట్ సర్జరీలలో 3.7%, కిడ్నీ సర్జరీలలో 1.9%, బ్లాడర్ సర్జరీలలో 17.9% మాత్రమే సమస్యలు తలెత్తాయని, ఇది చాలా తక్కువని ఆయన పేర్కొన్నారు. మొత్తం 137 సర్జరీలలో కేవలం రెండింటిని మాత్రమే సాంప్రదాయ పద్ధతికి మార్చాల్సి వచ్చిందని, ఒకటి రోబోలో సాంకేతిక లోపం కారణంగా, మరొకటి రోగి కేసు సంక్లిష్టంగా ఉండటం వల్ల జరిగిందని నవ్‌ఫాల్ వివరించారు.

ఇదిలా ఉండగా, ఎలాన్ మస్క్ కంపెనీ న్యూరాలింక్ ప్రస్తుతం బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ఫేస్ టెక్నాలజీపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. పక్షవాతం లేదా నరాల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తుల కోసం మెదడు ద్వారా నియంత్రించగల పరికరాలను రూపొందించడమే ఈ సంస్థ లక్ష్యం. ఇప్పటివరకు ముగ్గురు వ్యక్తులు విజయవంతంగా న్యూరాలింక్ బ్రెయిన్ ఇంప్లాంట్‌ను పొందారు.

"అంతా సవ్యంగా జరిగితే, కొద్ది సంవత్సరాలలో వందలాది మంది, ఐదేళ్లలో పదివేల మంది, పదేళ్లలో లక్షలాది మంది న్యూరాలింక్ ఇంప్లాంట్లను కలిగి ఉంటారు" అని మస్క్ 2024లో 'ఎక్స్' వేదికగా అంచనా వేశారు.


More Telugu News