జానారెడ్డితో రేవంత్ రెడ్డి కీలక సమావేశం

  • మావోయిస్టులతో శాంతి చర్చలు, కాల్పుల విరమణపై ప్రధానంగా చర్చ
  • గత అనుభవం దృష్ట్యా జానారెడ్డి సలహాలు తీసుకున్న సీఎం
  • శాంతి చర్చల కమిటీతో భేటీ అనంతరం ఈ సమావేశం
తెలంగాణలో మావోయిస్టులతో శాంతి చర్చల పునరుద్ధరణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డితో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టులతో చర్చలు జరిగినప్పుడు హోంమంత్రిగా పనిచేసిన జానారెడ్డి అనుభవాన్ని ఈ సందర్భంగా వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

కాల్పుల విరమణ, శాంతి చర్చల ప్రక్రియకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. శాంతి చర్చల కమిటీ ప్రతినిధులతో ఆదివారం జరిగిన సమావేశంలోనే జానారెడ్డి సలహాలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి సూచనప్రాయంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే తాజా భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో శాంతి చర్చల సమయంలో ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్‌గా ఉన్న దిగ్విజయ్ సింగ్‌తో కూడా సీఎం రేవంత్ ఫోన్‌లో సంప్రదింపులు జరిపారు. మావోయిస్టుల సమస్యను కేవలం శాంతిభద్రతల సమస్యగా కాకుండా సామాజిక సమస్యగా పరిగణిస్తున్నామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రభుత్వ తాజా అడుగులు చర్చల ప్రక్రియకు మార్గం సుగమం చేస్తాయని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 


More Telugu News