రీచార్జ్ అయ్యేందుకు సన్ రైజర్స్ ను విహారయాత్రకు పంపించిన కావ్య పాప!

  • చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయానంతరం సన్‌రైజర్స్ ఆటగాళ్లు మాల్దీవులకు పయనం్
  • నూతనోత్తేజం కోసం జట్టుకు స్వల్ప విరామం
  • చెపాక్‌లో గెలుపుతో ప్లేఆఫ్ ఆశలు సజీవం
  • ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన 5 మ్యాచ్‌లూ గెలవాల్సిన పరిస్థితి
  • మే 2న అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో సన్ రైజర్స్ తదుపరి పోరు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తాజా సీజన్‌లో తమ ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకునే దిశగా కీలక అడుగు వేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు, కాస్త సేద తీరేందుకు మాల్దీవులకు పయనమైంది. శుక్రవారం నాడు చెన్నై సూపర్ కింగ్స్‌ తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన అనంతరం, ఆటగాళ్లు ఈ చిన్న విరామాన్ని తీసుకున్నారు.

ఈ విషయాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఈ మేరకు 35 సెకన్ల వీడియో పంచుకుంది. ఇందులో ఆటగాళ్లు మాల్దీవుల్లో తమ విరామాన్ని ఆస్వాదిస్తున్న దృశ్యాలు ఉన్నాయి. తదుపరి మ్యాచ్ కు మరికొన్ని రోజుల సమయం ఉండడంతో తమ ఆటగాళ్లు రీచార్జ్ అయ్యేందుకు ఈ వెకేషన్ ఉపకరిస్తుందని సన్ రైజర్స్ టీమ్ యాజమాన్యం భావిస్తోంది.

చెన్నైలోని చెపాక్ మైదానంలో సీఎస్‌కేపై సాధించిన ఈ గెలుపు సన్‌రైజర్స్ జట్టుకు ఎంతో కీలకం. ఈ విజయంతో ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉండటమే కాకుండా, చెపాక్‌లో చెన్నైపై తమ ఓటముల పరంపరకు కూడా సన్‌రైజర్స్ తెరదించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 9 మ్యాచ్‌లలో 3 విజయాలతో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. 

ప్లేఆఫ్స్ కు అర్హత సాధించాలంటే, పాట్ కమిన్స్ నేతృత్వంలోని ఈ జట్టు తమ తదుపరి ఐదు మ్యాచ్‌లలోనూ తప్పక గెలవాల్సిన క్లిష్ట పరిస్థితి నెలకొంది. ఏ ఒక్క మ్యాచ్ ఓడినా ప్లేఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారతాయి. సన్‌రైజర్స్ తమ తదుపరి మ్యాచ్‌ను మే 2న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో ఆడనుంది.

చెన్నైతో మ్యాచ్‌లో విజయం సాధించడంలో తమ బ్యాటింగ్ వ్యూహాలు ఫలించాయని సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచ్ డేనియల్ వెటోరి తెలిపారు. ముఖ్యంగా కమిందు మెండిస్‌ను జట్టులోకి తీసుకోవడం, బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేయడం కలిసి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. "కమిందును జట్టులోకి తీసుకురావడం, హెన్రిచ్ క్లాసెన్‌ను ముందు పంపించి, నితీష్ కుమార్ రెడ్డిని తర్వాత పంపించడం వంటి మార్పులతో, ముఖ్యంగా ఛేజింగ్‌లో, సమతుల్యత సాధించగలిగాం" అని వెటోరి వివరించారు.




More Telugu News