Haneef Abbasi: 130 అణ్వాయుధాలు భారత్‌వైపు చూస్తున్నాయి.. ఇండియాను బహిరంగంగా హెచ్చరించిన పాక్ మంత్రి

130 Nuclear Missiles Aimed at India Pakistan Ministers Warning
  • ఘోరీ, షాహీన్, ఘజ్నవి క్షిపణలు ఉన్నది ప్రదర్శన కోసం కాదన్న పాక్ మంత్రి హనీఫ్ అబ్బాసి
  • సింధు జలాలను ఆపితే పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరిక
  • క్షిపణులను తాము ఎక్కడెక్కడ మోహరించామో ఎవరూ ఊహించలేరన్న మంత్రి
  • తాము గగనతలం మూసివేయడంతో భారత విమానయాన రంగం అల్లాడిపోతోందని వ్యాఖ్య
పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుండటంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాక్ ఇప్పుడు బహిరంగ బెదిరింపులకు దిగింది. అణ్వాయుధాలతో భారత్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని పాక్ మంత్రి హనీఫ్ అబ్బాసి బహిరంగంగా ప్రకటించారు. ఘోరీ, షాహీన్, ఘజ్నవి వంటి క్షిపణులతోపాటు 130 అణ్వాయుధాలను భారత్ కోసం మాత్రమే ఉంచినట్టు పేర్కొన్నారు. 

సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దుచేసి తమకు రావాల్సిన నీటి సరఫరాను ఆపితే పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధంగా ఉండాలని హనీఫ్ అబ్బాసి హెచ్చరించారు. తమ వద్ద ఉన్న సైనిక సామగ్రి, క్షిపణులు ప్రదర్శన కోసం కాదని, తాము ఎక్కడెక్కడ అణ్వాయుధాలను మోహరించామో ఎవరూ ఊహించలేరని అన్నారు. అవన్నీ భారత్ లక్ష్యంగానే ఉన్నాయని పేర్కొన్నారు.

పహల్గామ్ దాడి తర్వాత 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు భారత్ ప్రకటించింది. చుక్క నీరు కూడా పాక్‌కు వెళ్లబోదని పేర్కొంది. పాక్ పౌరులకు వీసాలను కూడా రద్దు చేసింది. ఈ నేపథ్యంలో పాక్ నుంచి ఇలాంటి కవ్వింపు ప్రకటనలు వస్తుండటం గమనార్హం. భారత్ నిర్ణయాలను వ్యంగ్యంగా విమర్శించిన అబ్బాసి.. ఇండియా తన చర్యలకు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తమ గగన తలాన్ని మూసివేయడంతో భారత విమానయాన రంగంలో రెండు రోజుల్లోనే గందరగోళం నెలకొందన్నారు. ఇది ఇలాగే కొనసాగితే భారత విమానయాన సంస్థలు దివాలా తీస్తాయన్నారు. 

భద్రతా వైఫల్యాలను దాచిపెట్టేందుకే ఆరోపణలు
పహల్గామ్ దాడి విషయంలో పాక్‌పై ఆరోపణలు మోపడం వల్ల భారత్ తన భద్రతా వైఫల్యాలను దాచి పెట్టేందుకు ప్రయత్నిస్తోందని అబ్బాసి ఆరోపించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని నిలిపివేయాలన్న భారత నిర్ణయాన్ని ఎదుర్కొనేందుకు పాక్ ఇప్పటికే సిద్ధమైనట్టు ప్రకటించారు. మరోవైపు, పాక్ రక్షణ మంత్రి ఖావాజా అసిఫ్ కూడా ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ గత మూడున్నర దశాబ్దాలుగా ఉగ్రవాద గ్రూపులకు పాక్ మద్దతు ఇచ్చిందని అంగీకరించారు. లష్కరే తోయిబా అనేది ఒక పాత పేరు అని, ఇప్పుడు దాని ఉనికే లేదని చెప్పారు. పహల్గామ్ దాడిని తాము తీవ్రంగా ఖండించామని అసిఫ్ తెలిపారు. 
Haneef Abbasi
Pakistan Minister
India-Pakistan Relations
Nuclear Weapons
Indus Waters Treaty
Pulwama Attack
Pakistan Military
Khawaja Asif
Indo-Pak Tension
Nuclear Threat

More Telugu News