Andhra Pradesh Government: ఏపీలో హోటల్ బార్లకు బిగ్ రిలీఫ్ .. లైసెన్సు ఫీజు భారీగా తగ్గింపు

AP Govt Announces Big Relief for Hotel Bars License Fees Slashed
  • హోటల్ బార్ల నిర్వాహకులకు గుడ్ న్యూస్
  • హోటల్ బార్ల లైసెన్సు ఫీజులు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ల చార్జీలు భారీగా తగ్గింపు
  • త్రీ స్టార్ సహా ఆ పైస్థాయి హోటళ్లలో నిర్వహించే బార్లకు వర్తింపు
  • 2025 సెప్టెంబర్ 1 నుంచి కొత్త ఉత్తర్వులు అమల్లోకి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్టార్ హోటళ్లలో నిర్వహించే బార్ల లైసెన్సు ఫీజులు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలను భారీగా తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా ఆయా హోటళ్లకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్రంలో త్రీస్టార్ హోటల్స్ మరియు ఆ పై స్థాయి హోటల్స్‌లోని బార్ల లైసెన్స్ మరియు నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలను తగ్గిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రస్తుతం హోటళ్లలోని బార్లకు సంబంధించి వార్షిక లైసెన్సు ఫీజు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు కలిపి రూ.66.55 లక్షలు ఉండగా, వాటిని రూ.25 లక్షలకు తగ్గించింది. గత ప్రభుత్వం 2022లో తీసుకున్న బార్ల నిబంధనల్లో త్రీస్టార్, ఆ పైస్థాయి బార్లకు వార్షిక లైసెన్సు ఫీజు రూ.5 లక్షలు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఫీజు రూ.50 లక్షలుగా నిర్ణయించింది. అంతేకాకుండా, ఈ ఫీజులు ఏటా పది శాతం పెరుగుతాయని అప్పట్లో పేర్కొంది. దీనితో ఇప్పుడు రెండు కలిపి మొత్తం ఫీజు రూ.66.55 లక్షలకు చేరింది.

దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లైసెన్సు మరియు రిజిస్ట్రేషన్ ఫీజులు అధికంగా ఉన్నాయని, వాటిని తగ్గించాలని ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఎండీ ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన మేరకు ప్రభుత్వం స్పందిస్తూ, ఏడాదికి లైసెన్సు ఫీజు రూ.5 లక్షలు, నాన్ రిఫండబుల్ ఛార్జీ రూ.20 లక్షలుగా నిర్ణయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా, ఏటా పది శాతం ఫీజు పెంపును కూడా తొలగించింది.

పర్యాటకంతో పాటు ఆతిథ్య రంగానికి ప్రోత్సాహం అందించేందుకు లైసెన్సు ఫీజులను తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. తగ్గించిన ఫీజులు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ఎక్సైజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్‌ కుమార్‌ మీనా విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 
Andhra Pradesh Government
Hotel Bar Licenses
AP Tourism Development Corporation
AP Excise Department
Three-Star Hotels
Bar Licenses Andhra Pradesh

More Telugu News