ఉక్రెయిన్ తో చర్చల పునరుద్ధరణకు సిద్ధమే: పుతిన్

  • ముందస్తు షరతులు లేకుండా ఉక్రెయిన్ తో చర్చలకు సిద్దమన్న రష్యా అధ్యక్షుడు పుతిన్
  • అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కఫ్ తో ఈ విషయాన్ని తెలిపినట్లు వెల్లడించిన క్రెమ్లిన్ వర్గాలు 
  • ట్రంప్ సూచించిన కొద్ది గంటల్లోనే మాస్కో నుంచి సానుకూల స్పందన
ఉక్రెయిన్‌తో ముందస్తు షరతులు లేకుండా చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్న అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్‌కఫ్‌తో ఈ విషయాన్ని తెలిపినట్లు క్రెమ్లిన్ వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్‌తో చర్చలకు సంబంధించిన విషయాన్ని పుతిన్ అనేకమార్లు స్పష్టం చేశారని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్ర పెస్కోవ్ తెలిపారు.

యుద్ధం ముగించేందుకు చర్చల కోసం ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులకు పాల్పడటంపై డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. ఉక్రెయిన్‌లోని నివాస ప్రాంతాలపై రష్యా సైన్యం దాడులు చేస్తుండటం చూస్తుంటే పుతిన్ యుద్ధం ఆపడానికి సిద్ధంగా లేరని అనిపిస్తోందన్నారు. అనేకమంది ప్రజలు చనిపోతున్నారని, మాస్కోపై మరిన్ని ఆంక్షలపై ఆలోచించక తప్పదని అన్నారు. రోమ్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ తర్వాత సొంత సోషల్ మీడియా వేదికపై ట్రంప్ ఈ విధంగా స్పందించారు.

భీకర దాడులను ఆపాలని, ఇప్పటికైనా శాంతి ఒప్పందం చేసుకోవాలని పుతిన్‌కు ట్రంప్ సూచించిన నేపథ్యంలో కొద్దిగంటల్లోనే మాస్కో నుంచి సానుకూల స్పందన రావడం విశేషం. 


More Telugu News