C.S. Rangarajan: నాపై దాడి చేసిన వారిని వదిలేది లేదు.. దాడికి అదే కారణం కావొచ్చు: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్

Chilakuru Balaji Temple Priest Attacked Priest Vows Legal Action
  • దాడి చేసిన వారిపై న్యాయపోరాటం చేస్తానన్న రంగరాజన్ 
  • ఫిబ్రవరి 7న తన నివాసంలోకి వచ్చి దాడి చేశారని వెల్లడి
  • ఈ దాడి వెనుక ఆలయానికి సంబంధించిన కోర్టు వివాదమే కారణం కావొచ్చని అనుమానం
  • దీని వెనుక ఎంతటి వారున్నా వదిలేది లేదని వ్యాఖ్య
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ తనపై రెండు నెలల క్రితం జరిగిన దాడి ఘటనపై తీవ్రంగా స్పందించారు. దాడి చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

దాడి ఘటన వివరాలను రంగరాజన్ వివరిస్తూ, "ఫిబ్రవరి 7వ తేదీన కొందరు వ్యక్తులు మా ఇంటికి వచ్చి తలుపులు తట్టారు. అప్పుడు నేను స్నానం చేయనందున టీషర్టులో ఉన్నాను, ఇప్పుడు ఎవరినీ కలవలేనని చెప్పాను" అని తెలిపారు. వారిలో నల్ల బట్టలు ధరించిన ఒక వ్యక్తి, 'రామరాజ్యం కోసం పనిచేసే వారిని కలవడానికి మీకు సమయం లేదా?' అంటూ 'టేక్ హిమ్ కస్టడీ' అని అన్నట్లు రంగరాజన్ గుర్తుచేసుకున్నారు. ఆ వ్యక్తి మాటలు విని ఎవరో పెద్ద అధికారి అయి ఉంటారని తాను భావించినట్లు చెప్పారు.

అనంతరం, సుమారు 20 మంది వ్యక్తులు ఒక్కసారిగా తలుపులు తోసుకుని ఇంట్లోకి ప్రవేశించారని రంగరాజన్ ఆరోపించారు. "వారు నన్ను కాళ్లు పట్టి లాగి కిందపడేసి దాడి చేశారు. ఈ ఘటనతో నేను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను" అని ఆయన వివరించారు. ఈ దాడిని తేలిగ్గా తీసుకునేది లేదని, దీనిపై కచ్చితంగా న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. దాడికి పాల్పడిన వారిపై సివిల్, క్రిమినల్ పరువు నష్టం దావాలు వేస్తామని తెలిపారు.

ఈ దాడి వెనుక ఆలయానికి సంబంధించిన కోర్టు వివాదమే కారణమని రంగరాజన్ అనుమానం వ్యక్తం చేశారు. "ఆలయానికి సంబంధించిన విషయం కోర్టు పరిధిలో ఉంది. ఈ దాడి వెనుక ఎంత పెద్దవారు ఉన్నా సరే, శిఖండిలా తెర వెనుక ఉండి వ్యవహరించవద్దు" అని ఆయన వ్యాఖ్యానించారు. తమపై ఆరోపణలు చేసేవారు కోర్టులో వాదనలు వినిపించి, తాము తప్పు చేయలేదని నిరూపించుకోవాలని రంగరాజన్ సవాలు విసిరారు.
C.S. Rangarajan
Chilakuru Balaji Temple
Temple Attack
Court Dispute
Hyderabad Press Club
Assault Case
Legal Action
Religious Dispute
India

More Telugu News