అబ్బే.. పహల్గామ్ దాడి మా పని కాదు.. ప్లేట్ ఫిరాయించిన టీఆర్ఎఫ్‌!

  • మా వ్యవస్థల్ని భారత్‌ హ్యాక్‌ చేసింద‌న్న ఉగ్ర‌వాద సంస్థ‌
  • ఇంతకుముందు వచ్చిన ప్రకటనతో త‌మ‌కు ఎలాంటి సంబంధం లేద‌ని వెల్ల‌డి
  • మొదట ఈ పాశ‌విక‌ దాడి తమ పనే అని ప్రకటించుకున్న టీఆర్‌ఎఫ్
  • ఇప్పుడు మాట మార్చిన వైనం
పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేసే నిషేధిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా (ఎల్ఈటీ) అనుబంధ సంస్థ అయిన 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' (టీఆర్‌ఎఫ్) పహల్గామ్ ఘ‌ట‌న‌పై తాజాగా సంచలన ప్రకటన విడుద‌ల చేసింది. మొదట ఈ పాశ‌విక‌ దాడి తమ పనే అని ప్రకటించుకున్న టీఆర్‌ఎఫ్... ఇప్పుడు ప్లేట్ ఫిరాయించింది. పహల్గామ్‌లో పర్యాటకులపై దాడి తమ పని కాదని తెలిపింది. తమ వ్యవస్థలను భారత్‌ హ్యాక్‌ చేసినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది.

"పహల్గామ్ దాడిలో మా ప్రమేయం లేదు. ఈ చర్యను టీఆర్‌ఎఫ్‌కు ఆపాదించడం తొందరపాటు చర్యే అవుతుంది. ఇంతకుముందు వచ్చిన ప్రకటనతో కూడా మాకు ఎలాంటి సంబంధం లేదు. భారత్‌ మా వ్యవస్థల్ని హ్యాక్‌ చేసి ఆ సందేశాన్ని పోస్ట్‌ చేసింది. ఇది భారత సైబర్‌-ఇంటెలిజెన్స్‌ ఆపరేటివ్‌ల పని. దీనిపై మేము పూర్తి దర్యాప్తు చేస్తున్నాం. రాజకీయ ప్రయోజనాల కోసం భారత్‌ ఇలా చేయడం ఇదేమీ మొద‌టిసారి కాదు" అంటూ టీఆర్‌ఎఫ్ ఆరోపించింది.

కాగా, పహల్గామ్‌లో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసర‌న్‌లో ఉగ్రవాదులు ఈ నెల 22న నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. అడవిలో నుంచి వచ్చిన ముష్క‌రులు సంద‌ర్శ‌కులే లక్ష్యంగా విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో 26 మంది ప‌ర్యాట‌కులు ప్రాణాలు కోల్పోయారు. మొద‌ట ఈ దాడి తమ పనే అని ప్ర‌క‌టించుకున్న టీఆర్‌ఎఫ్‌ ఇప్పుడు మాట మారుస్తూ, భారత్‌పై ఆరోపణలు చేయడం గమనార్హం.



More Telugu News