Bilawal Bhutto Zardari: సింధు నదిలో భారతీయుల రక్తం పారిస్తాం.. పాక్ మాజీ మంత్రి వ్యాఖ్య

Bilawal Bhuttos Threat on Indus Water

  • నదీ జలాల ఒప్పందం రద్దుపై భారత్‌కు బిలావల్ భుట్టో వార్నింగ్
  • పాకిస్థాన్‌లో నీటి ప్రాజెక్టులపై అంతర్గత వివాదాలు
  • ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ వివాదాలకు సిద్ధమవుతున్న ఇరు దేశాలు

ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారత్ లో దాడులకు ప్రేరేపిస్తున్న పాకిస్థాన్ కు చుక్క నీరు కూడా వదలబోమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వానికి కేంద్రం సమాచారం అందించింది. ఈమేరకు ఓ లేఖ రాసింది. ఈ పరిణామంతో పాకిస్థాన్ లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. జీవాధారంగా ఉన్న సింధు నదిలో నీటిని ఆపేస్తే పాకిస్థాన్ ఎడారిగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ క్రమంలోనే అక్కడి నేతలు ఆగ్రహంగా స్పందిస్తున్నారు. పాకిస్థాన్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ తీవ్రంగా స్పందించారు. సింధు నది ఒడ్డున ఉన్న సుక్కూర్‌లో మాట్లాడుతూ, "సింధు నది పాకిస్థాన్‌దేనని గతంలో భారత్ అంగీకరించింది. ఇప్పుడు ఏకపక్షంగా ఒప్పందాన్ని రద్దు చేశారు. సింధు నది మాది, మాకే సొంతం. ఈ నదిలో నీరు ప్రవహిస్తుంది, లేదంటే వారి (భారతీయుల) రక్తమైనా ప్రవహిస్తుంది" అంటూ తీవ్ర పదజాలంతో హెచ్చరించారు.

పహల్గామ్ దాడిలో 26 మంది మరణించిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' ఈ దాడికి బాధ్యత వహించింది. పాకిస్థాన్‌ సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందన్న కారణంతో భారత్, సింధు జలాల ఒప్పందాన్ని పునఃసమీక్షించాలని, ప్రస్తుత పరిస్థితుల్లో ఒప్పందాన్ని సదుద్దేశంతో అమలు చేయలేమని పేర్కొంటూ పాకిస్థాన్‌ జలవనరుల మంత్రిత్వ శాఖకు అధికారికంగా నోటీసు పంపింది. ఒప్పందంలోని ఆర్టికల్ XII(3)ను ప్రస్తావిస్తూ, మారుతున్న జనాభా, ఇంధన అవసరాలు, ఉగ్రవాద ప్రోత్సాహాన్ని కారణంగా చూపింది.

మరోవైపు, ఈ పరిణామం పాకిస్థాన్‌లో అంతర్గత కలహాలకు దారితీసింది. పంజాబ్ ప్రావిన్షియల్ ప్రభుత్వం, సైన్యం సంయుక్తంగా చేపట్టిన చోలిస్థాన్ కాల్వల ప్రాజెక్టును పీపీపీ, సింధ్ ప్రావిన్స్‌ల నుంచి వచ్చిన వ్యతిరేకతతో నిలిపివేయాల్సి వచ్చింది. పరస్పర అంగీకారంతో కౌన్సిల్ ఆఫ్ కామన్ ఇంట్రెస్ట్స్ (సీసీఐ)లో నిర్ణయం తీసుకునే వరకు కొత్త కాల్వలు నిర్మించబోమని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, బిలావల్ భుట్టోతో భేటీ అనంతరం ప్రకటించారు.

Bilawal Bhutto Zardari
India-Pakistan Relations
Indus Waters Treaty
Pakistan
India
Terrorism
Amit Shah
Shehbaz Sharif
Indus River
Sucuur
  • Loading...

More Telugu News